యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసంతోపాటు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని విశేషంగా అలంకరించిన అర్చకులు భాజాభజంత్రీల నడుమ తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. సేవకు ముందు మహిళలు మంగళ హారతులతో నీరాజనం పలికారు. అనంతరం అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి, పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పూజలు చేసి, హారతినిచ్చారు. అమ్మవారికి ఇష్టమైన నాదస్వరాన్ని వినిపించారు. అమ్మవారి సేవలో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి
చౌటుప్పల్ : అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. శుక్రవారం ఆమె చౌటుప్పల్ మండలం దామెర గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని, వీబీజీ రామ్‌జీ పథకం కింద నిర్మించిన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో మిగిలిన కొంత రోడ్డు భాగాన్ని పూర్తి చేయించేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. అనంతరం జూమ్ మీటింగ్ నిర్వహించి చౌటుప్పల్, రామన్నపేట, నారాయణపురం మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
మిర్యాలగూడ : కృష్ణా, గోదావరి నదుల జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. నదీజలాల వినియోగంపై ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రిపోర్టును బయటపెట్టకుండా కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రాల మధ్య జల తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్రం నాన్చుడు ధోరణి వీడాలన్నారు. ఆయన శుక్రవారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని చెరువులు, కుంటలను నింపకపోతే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందన్నారు. సమావేశంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, శ్రీను, రామ్మూర్తి, పాండు, రాంరెడ్డి, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లులో తనిఖీలు
మిర్యాలగూడ : విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద గల శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్‌లో తనిఖీలు నిర్వహించారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి రూ.80 లక్షల విలువైన కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం పక్కదారిపట్టినట్టు తనిఖీల్లో తేలిందని సమాచారం. విజిలెన్స్ అధికారులు రైస్‌మిల్లులోని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.


