నల్లగొండ: నల్లగొండ జిల్లా జైలును జైళ్ల శాఖ డీఐజీ దుద్దిళ్ల శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కారాగారంలో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసం కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, వారికి అందిస్తున్న ఆహారం, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. అంతకు ముందు డీఐజీకి కారాగారం పర్యవేక్షణ అధికారి కూన ఆనందరావు, జిల్లా ఉప కారాగారాల పర్యవేక్షణ అధికారి శోభన్ బాబు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ.. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జైలర్లు బాలకృష్ణ, అచ్చయ్య, జైలు సిబ్బంది పాల్గొన్నారు.


