పరిశ్రమలపై కొరవడిన నిఘా | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలపై కొరవడిన నిఘా

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

మిగతా నలుగురు ఎక్కడ?

కొండమడుగు డ్రగ్స్‌ కేసులో మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో స్థానికుడు ఒకరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్‌ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

150 వరకు పరిశ్రమలున్నా.. తనిఖీలు నామమాత్రమే

ఏ కంపెనీలో ఏం తయారు చేస్తున్నారో అధికారులకు తెలియని పరిస్థితి

ఇటీవల కొండమడుగు శివారులో రూ. 57 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌

ఏదైనా ఘటన జరిగినప్పుడేఅధికారుల హడావుడి

సాక్షి, యాదాద్రి: ఫార్మా, రసాయన పరిశ్రమలు అక్రమంగా డ్రగ్స్‌ తయారీకి అడ్డాగా మారుతున్నాయి. స్థానిక అధికారుల నిఘా లోపం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో మత్తు మాఫియా యథేచ్ఛగా తమ కార్యకలాపాలను సాగిస్తోంది. ఇటీవల బీబీనగర్‌ పరిధిలో రూ. 57 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడటంతో ఈ వ్యవహారం మరోసారి బహిర్గతమైంది. యాంటీ–నార్కోటిక్స్‌ బ్యూరో, కౌంటర్‌–ఇంటెలిజెన్స్‌ లాంటి ఉన్నత విభాగాలు రంగంలోకి దిగి అంతర్‌ రాష్ట్ర ముఠాల గుట్టు రట్టు చేస్తున్నాయి. క్షేత్రస్థాయి అధి కారుల మొక్కుబడి తనిఖీల కారణంగా డ్రగ్స్‌ ఇక్క డి నుంచి దేశంలో ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయో కూడా అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.

మొక్కుబడి తనిఖీలు..

ఫార్మా, రసాయనాల కంపెనీలకు జిల్లా నిలయంగా మారింది. చౌటుప్పల్‌, భువనగిరి, పోచంపల్లి, బొమ్మలరామారంతో పాటు ఒక్క బీబీనగర్‌ పరిధిలోనే దాదాపు 100 నుంచి 150 వరకు ఫార్మా, కెమికల్‌, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. కానీ, వాటిలో ఏం తయారవుతుందనే దానిపై అధికారుల వద్ద ఎలాంటి స్పష్టమైన నివేదికలు లేవు. జిల్లాకు చెందిన డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో, డ్రగ్స్‌ పట్టుబడినప్పుడు మాత్రమే హడావుడి చేసే యంత్రాంగం, ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇన్నేళ్లుగా ఇక్కడ తయారైన కోట్లు విలువ చేసే మెఫెడ్రన్‌ దేశంలో ఎక్కడెక్కడికి పంపించారన్న లెక్కలు కూడా ఎవరి వద్దా లేవు.

సాంకేతిక పరిజ్ఞానంతో..

మత్తు పదార్థాల రవాణా అంతర్‌ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. పోలీస్‌ ఇంటెలిజెన్స్‌, తెలంగాణ యాంటీ–నార్కోటిక్స్‌ బ్యూరో, స్థానిక పోలీసులు, డ్రగ్స్‌ కంట్రోల్‌, సైబర్‌ విభాగాల సమన్వయంతో ఈ భారీ స్కెచ్‌ను బట్టబయలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, సరఫరా మార్గాలు, నిల్వ కేంద్రాలు, డ్రగ్స్‌ విక్రయించే హాట్‌స్పాట్‌లను గుర్తించి నెట్‌వర్క్‌ మ్యాప్‌ రూపొందించారు. ఏఐ, డేటా విశ్లేషణ, సీసీ కెమెరాలు, ఫోన్‌ సంభాషణలు, వాయిస్‌ ఆధారిత డేటాను ట్రేస్‌ చేశారు. ఆర్థిక లావాదేవీల ఆధారాలు సేకరించి, ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌లను జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, అస్సాం, హైదరాబాద్‌కు చెందిన వారిని పాత్రధారులుగా గుర్తించారు.

ఎప్పుడెప్పుడు పట్టుకున్నారంటే..

● ఇటీవల బీబీనగర్‌ మండలం కొండమడుగు శివారులో రూ. 57 కోట్ల విలువ చేసే 27 కిలోల మెఫెడ్రన్‌, 40 కిలోల అసిటోన్‌ లిక్విడ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్రామంలోని వేటుకూరి ల్యాబ్స్‌లో మెఫెడ్రన్‌ అక్రమంగా తయారు చేసినట్లు గుర్తించి, రియాక్టర్‌, సెంట్రిఫ్యూజ్‌ తదితర పరికరాలను సీజ్‌ చేశారు.

● యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులోని ఓ రసాయన పరిశ్రమలో గతంలో 100 కేజీల మెఫెడ్రన్‌ పట్టుబడింది.

● 2024లో బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద కూడా 100 కిలోల మెఫెడ్రన్‌ పట్టుబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement