రామన్నపేట: పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ సాత్విక్ సూచించారు. బుధవారం మునిపంపుల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, ఉద్యోగుల హాజరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించే గురుతరమైన బాధ్యత పీహెచ్‌సీ ఉద్యోగులపై ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యులు శివసాయి, కల్యాణ,ి సూపర్‌వైజర్ వాణిశ్రీ,, ల్యాబ్‌టెక్నీషియన్ యాదగిరి ఉన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా బొట్ల కృష్ణ
మోటకొండూర్ : ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా మోటకొండూర్ గ్రామానికి చెందిన బొట్ల కృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బొట్ల కృష్ణ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన సంఘం జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెళ్ల రమేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
సేంద్రియ సాగు మేలు
రాజాపేట : రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగు చేపడితే మేలు కలుగుతుందని కృషి విజ్ఞాన్ కేంద్రం రిటైడ్ సైంటిస్టు నర్సింహారెడ్డి, ఆత్మ డీపీడీ దేవ్ సింగ్ సూచించారు. బుధవారం రాజాపేట రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో సాగు పద్ధతులపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి కాకుండా తక్కువ నీటితో ఎక్కువ సాగు అయ్యే కూరగాయలు, ఆరుతడిపంటలపై దృష్టి పెట్టాలని కోరారు. భూసార పరీక్షల ప్రకారం ఎరువులు వాడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేస్తున్న గౌటె బాలరాజు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జీవామృతం తయారీ విధానాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డివిజన్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఏఓ పద్మజ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిలివేరు బాలరాజు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నెమిల మహేందర్ గౌడ్, ఆత్మ కమిటీ సభ్యుడు రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దేశ చరిత్రను యువత అధ్యయనం చేయాలి
చౌటుప్పల్ : యువత దేశ చరిత్రను అధ్యయనం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహ ప్రచారక్ కల్పగురు ప్రభాకర్‌జీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం చౌటుప్పల్ పట్టణంలో యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి యువత త్యాగం, సేవ, సమర్పణ అనే భావాలను కలిగి ఉండాలన్నారు. ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత దేశభక్తుడై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సహకార్య వాహ తాడెం పాండుజీ, కె.కృష్ణయ్యజీ, ఏబీవీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ, యాదాద్రి జిల్లా కన్వీనర్ ఉబ్బు సాయికిరణ్, ప్రచార ప్రతినిధి నారి మధు, ఆర్‌ఎస్‌ఎస్ చౌటుప్పల్ ఖండ మహిపాల్‌రెడ్డి, కార్యవాహ బడుగు శ్రీరాములు, సహ కార్యవాహ రేణుకుమార్, ప్రతినిధులు మోదుగు కమలాకర్‌రెడ్డి, ఎ.మహిపాల్‌రెడ్డి, వేముల నర్సింహ, సిలువేరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


