‘యాదాద్రి మొరింగా మిషన్–2026’కు శ్రీకారం
సాక్షి, యాదాద్రి : తక్కువ ఖర్చుతో రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మునగ సాగుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యాదాద్రి మొరింగా మిషన్–2026 పేరుతో వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు మునగ సాగు కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో, పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో మునగను సాగు చేయించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న మునగ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతులను పెంచి రైతులకు అధికాదాయం అందించాలని యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ పలు దఫాలుగా చర్చించారు.
500 ఎకరాల్లో సాగే లక్ష్యం
ఈ వానాకాలం సీజన్‌లో మునగ సాగును ప్రోత్సహించడానికి జిల్లాలో బొమ్మలరామారం, ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు ఆరు మండలాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ముందుగా రైతులకు దీనిపై అవగాహన కల్పించనున్నారు. ప్రయోగాత్మకంగా ఒక్కో మండలంలో 25 ఎకరాల్లో సాగు చేయిస్తారు. 2026 నాటికి జిల్లాలో సుమారు 500 ఎకరాలకు మునగ సాగును విస్తరించడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది.
ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి..
సేంద్రియ పద్ధతిలో సాగు చేసే మునగ పంటకు ఎకరానికి సుమారు రూ.20 వేల పెట్టుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీలు అందించనుంది. ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీపై బిందు సేద్యం (డ్రిప్) పరికరాలు ఇస్తారు. ఆకును ఎండబెట్టి పొడి చేయడానికి అవసరమైన సోలార్ డ్రయ్యర్లను సైతం సబ్సిడీపై అందించనున్నారు.
గ్రామంలో మూడెకరాల్లో మునగ సాగు చేశాను. కన్యాకుమారి నుంచి విత్తనాలను తెప్పించాను. సేంద్రియ పద్ధతిలో సాగు చేయడంతో 4 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. రెండు నెలలకు ఒకసారి ఆకులను కట్ చేస్తాం. నేను పండించిన మునగాకుకు విదేశీ ఎగుమతి ఆర్డర్ రావడమే కాకుండా, మూడేళ్ల కాంట్రాక్టు దక్కింది. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం వస్తుంది. జిల్లాలో చేపడుతున్న మొరింగా మిషన్‌లో భాగస్వామిని అవుతున్నాను.
– మామిడి అమరేందర్‌రెడ్డి, మునగ రైతు, దత్తాయపల్లి, తుర్కపల్లి మండలం
కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శకత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే ఈ మునగ సాగు చేపట్టాం. పంట దిగుబడి కొనుగోళ్లకు భరోసా కల్పించడం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుంది. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలకు నేరుగా ఉపాధి కల్పిస్తాం. తద్వారా మహిళా సాధికారత సాధించవచ్చు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, ఆ తర్వాత జిల్లా అంతటా మోడల్‌గా మునగ సాగును విస్తరిస్తాం.
– వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
మునగాకు ఉత్పత్తులపై మహిళా రైతుతో చర్చిస్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతి (ఫెల్)
ఫ సేంద్రియ పద్ధతిలో మునగ సాగుకు ప్రణాళిక
ఫ ఈ వానాకాలంనుంచే సాగు ప్రారంభం
ఫ ప్రయోగాత్మకంగా ఐదు మండలాల ఎంపిక


