జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట బస్ షెల్టర్లు కరువయ్యాయి. కొన్నిచోట్ల బస్ షెల్టర్లు ఉన్నా అక్కడ ఆర్టీసీ బస్సులు ఆపడం లేదు. మరికొన్ని చోట్ల ఉన్న బస్ షెల్టర్లు కూర్చొటానికి సౌకర్యవంతంగా లేక నిరుపయోగంగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు బస్సుల కోసం ఎర్రటెండలో రోడ్లపైనే నిలబడి నిరీక్షిస్తున్నారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రయాణికులు రోడ్డు పక్కనే ఉన్న వివిధ దుకాణాల ముందు, చెట్ల నీడలో నిలబడుతున్నారు. ‘సాక్షి’ విజిట్‌లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.
గుండాల : మండల కేంద్రంలో నిర్మించిన బస్ షెల్టర్ ఉపయోగంలో లేకపోయింది. దీంతో మహిళలు, విద్యార్థులు, ప్రజలు గుండాల రోడ్డుపై ఎండలో నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత వేసవిలో నిలువ నీడ కరువైంది. ఇదిలా ఉంటే మాసాన్‌పల్లి గ్రామంలో తలపెట్టిన బస్ షెల్టర్ నిర్మాణ పనులు మూడు సంవత్సరాలుగా పిల్లర్ల దశలోనే ఉన్నాయి.


