స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

సాక్షి, యాదాద్రి : రానున్న స్థానిక సంస్థల (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్‌లో భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మండల, జిల్లా కమిటీల నియామకంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుకున్న వారికి, గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు.. కొత్త ఓటర్ల నమోదు, నకిలీ ఓట్ల గుర్తింపుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

వైభవంగా ఊంజల్‌ సేవోత్సవం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. ఈ సమయంలో మహిళ భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులను నివేధించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి

భూదాన్‌పోచంపల్లి : పట్టణంలో ఈ నెల 14న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ సమ్మేళన సమితి జిల్లా అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రి అన్నారు. శుక్రవారం పోచంపల్లి పట్టణంలోని మార్కండేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మజాగరణ ప్రముఖ్‌ బడుగు మహేశ్‌, విశ్వహిందూ పరిషత్‌ మండల శాఖ అధ్యక్షుడు కటకం తుకారాం, కౌన్సిలర్‌ కర్నాటి వరలక్ష్మినర్సింహ, బండి యాదగిరి, దోర్నాల గణేశ్‌, సాయిని భాస్కర్‌, చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, భిక్షపతిచారి తదితరులు పాల్గొన్నారు.

సాగర్‌లో నేడు, రేపు డయాబెటీస్‌ సదస్సు

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ విజయవిహార్‌లో శని, ఆదివారల్లో జాతీయస్థాయి డయాబెటీస్‌ సదస్సు జరగనుంది. రీసెర్చ్‌ సొసైటీ ఫర్‌ది స్టడీ ఆఫ్‌ డయాబెటీస్‌ ఇన్‌ ఇండియా(ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ) తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ వార్షిక డయాబెటీస్‌ సదస్సు–2026లో మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా వైద్యులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొనున్నారని పేర్కొన్నారు. శనివారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి సాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement