నో సిగ్నల్!
రామగిరి(నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తోంది. వీటిని ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) ఆధారిత వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈక్రమంలో సిగ్నల్స్ రాక పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోంది. మండలంలోని తొరగల్లు గ్రామంలో పింఛన్ చెల్లించేందుకు సిగ్నల్ లేక లబ్ధిదారులు, పోస్టల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి
గ్రామంలో 246 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. తొరగల్లు, చిన మాదారం, ఇరిగంటిపలి గ్రామాలకు ఒక పోస్ట్‌మాన్ ఉన్నాడు. వారం రోజుల్లో ఈ మూడు గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేస్తాడు. గతంలో పీఓటీడీ డివైస్ బయోమెట్రిక్ ద్వారా చెల్లించేవారు. 2025 జులై నుంచి ఫేస్ రికగ్నిషన్ ద్వారా చెల్లిస్తున్నారు. అయితే తొరగల్లు గ్రామంలో ఏ నెట్‌వర్క్ సరిగ్గా రావడం లేదు. దీంతో ఒక్కొక్కరికి 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతోంది. దీంతో పింఛన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రతి నెల గ్రామంలో 150 మందికి మాత్రమే పింఛన్ చెల్లించడానికి వీలవుతుంది. ఇక్కడి తీసుకోని వారు పక్క గ్రామమైన చిన మాదారం, ఇరుగంటిపల్లికి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
పింఛన్ కోసం తప్పని పాట్లు
సిగ్నల్ సరిగ్గా రాక తీసుకోని ఫేస్ రికగ్నిషన్
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది
పింఛన్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సెల్ సిగ్నల్ సరిగ్గా రాకపోవడం యాప్‌లో స్వీకరించడం లేదు. పక్క ఊరికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వస్తోంది. ఆరోగ్య సరిగ్గా సహకరించడం లేదు. ప్రతి నెలా వేరే ఊరికి వెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది.
– చింత ముత్తమ్మ
నో సిగ్నల్!


