సరికొత్తగా సెలబ్రేషన్స్
మూడు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లోని యువకులు గ్రూపులుగా ఏర్పడి విందు, మందు, వినోదం ఉండేలా వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 31వ తేదీ రాత్రి కేక్ కట్ చేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఫ ఇయర్ ఎండ్ వేడుకలకు సిద్ధమవుతున్న యువత
ఫ పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్
ఫ ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసేందుకు కొందరి ఆసక్తి
ఫ ఫామ్‌హౌస్‌లలో విందు, వినోదాలకు ప్రణాళిక
ఫ ‘మ్యూజికల్ నైట్స్’ నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు
భువనగిరిటౌన్, సూర్యాపేట టౌన్, రామగిరి(నల్లగొండ) : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికే సమయం దగ్గర పడింది. ఆట పాటలతో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు జరిపేందుకు యువత ప్రణాళికలు వేసుకుంటోంది. అందుకు అనుగుణంగా ఆయా వ్యాపార సంస్థలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి.
కొత్త సంవత్సరంలో యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే యోచనలో ఉన్నారు. కొందరు యువకులు గోవా, వైజాగ్, అరకుతోపాటు ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు హైదరాబాద్ శివారులోని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్, పబ్‌లలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వైద్యులు, వ్యాపారులు తమ కుటుంబంతో కలిసి రిసార్ట్స్‌లో వేడుకలు జరుపుకునేందుకు ఈ నెల 31న ఉదయమే హైదరాబాద్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా యువకులు పల్లె వాతావరణాన్ని ఆస్వాదించేందుకు మొగ్గుచూపుతున్నారు. పట్టణాలు, గ్రామాల సమీపంలోని తోటల్లో న్యూఇయర్ వేడుకలకు జరుపుకునేందుకు యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. ఇప్పుడు ట్రెండ్ మార్చుకుని స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వంటకాలు చేసుకుని పల్లె పదాలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ముఖ్యంగా తాటి కల్లు తీసుకుని.. కుండ చికెన్, వివిధ మాసాంహార వంటలు, రొట్టెలు స్వయంగా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రతి ఏడాది 31 రోజు వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు పెడుతుంటారు. హోటళ్ల ఎదుట పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకుంటే కిలో కేక్.. కిలో కేక్ తీసుకుంటే లీటరు కూల్ డ్రింక్ ఇలా ఆఫర్లు పెడుతూ బేకరీలు, హోటళ్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
యువత అభిరుచికి అనుగుణంగా పలు ప్రాంతాల్లో మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నారు. 31వ తేదీన నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్‌లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక, నల్లగొండ పట్టణం సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో న్యూ ఇయర్ నైట్ పార్టీకి ఏర్పాట్లు చేశారు. పార్టీకి హాజరయ్యే సింగిల్, జంటలకు
ఎంట్రీ ఫీజు వసూలు చేయనున్నారు.
సరికొత్తగా సెలబ్రేషన్స్
సరికొత్తగా సెలబ్రేషన్స్
సరికొత్తగా సెలబ్రేషన్స్


