నేడు వలిగొండకు మంత్రి వెంకట్‌రెడ్డి రాక
వలిగొండ : రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం వలిగొండకు రానున్నారు. వలిగొండ నుంచి కాటేపల్లి వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించనున్నారు. అదే విధంగా నూతన సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారని, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తల్లిదండ్రులను
విస్మరించొద్దు
చౌటుప్పల్ : ఆస్తులను పంచుకోవడమే కాదు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాగోగులను పట్టించుకోవాలని వయోవృద్ధుల పోషణ, సంరక్షణ ట్రిబ్యునల్ చైర్మన్ వెల్మ శేఖర్‌రెడ్డి సూచించారు. ట్రిబ్యునల్‌లో బాధితులు అందజేసిన పిటిషన్లపై శనివారం ఇరువర్గాలను పిలిచి విచారణ చేశారు. ఆస్తులను పంచుకొని, చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించడం బాధాకరమన్నారు. కన్నబిడ్డలపై తల్లిదండ్రులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే పరిస్థితి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ మెంబర్, సీనియర్ న్యాయవాది ముత్యాల సత్తిరెడ్డి, సెక్షన్ అధికారి కవిత తదితరులు పాల్గొన్నారు.
యాదగిరీశుడికి
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజా మున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం పాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర వేడుకలను నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండిజోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. పాతగుట్ట ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి, పారాయణికులు పాశురాలు పఠించారు.
నేడు వలిగొండకు మంత్రి వెంకట్‌రెడ్డి రాక


