పత్తి ముంచింది
పత్తికి ఆదిలోనే ఇబ్బందులు
ఎన్నో ఆశలతో వానాకాలం సేద్యాన్ని ప్రారంభించిన రైతులకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలకరి వానలకు విత్తిన పత్తి విత్తనాలు.. వరుణుడు ముఖం చాటేయడంతో భూమిలోనే మాడిపోయాయి. దీంతో ఒకటి, రెండుసార్లు విత్తాల్సి వచ్చింది. తీరా పంట చేతికి వచ్చాక కురిసిన భారీ వర్షాలు రైతులు పూర్తిగా నష్టపోయాడు. ఇక వరి సాగు గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ మెరుగైన దిగుబడులతో రైతన్న గట్టెక్కాడు.
వడ్ల అమ్మకాలకు అవస్థలు
ఎప్పటిమాదిరిగానే ఈసారి వానాకాలం ధాన్యం అమ్మకాలకు రైతులు అవస్థలు పడ్డారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వల్ల తక్కువ ధరకు ప్రైవేట్‌కు అమ్ముకున్నారు. 2,98,885 ఎకరాల్లో వరి సాగైంది. 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. 3.14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
అధికంగా దొడ్డు రకం వరి సాగు
సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ రైతులు ఆసక్తి చూపలేదు. మూసీ నీరు సన్నాల సాగుకు అనుకూలం కాకపోవడం, వర్షాలు కురిస్తే నూక ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాల సాగుకు మొగ్గు చూపారు. 2,98,885 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో దొడ్డురకం 2.75 లక్షలు, సన్నాలు 23 వేల ఎకరాల్లో సాగు చేశారు. 4.50 లక్షల మెట్రిక్‌న్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. అందులో దొడ్డురకం 3.15 లక్షల మెట్రిక్ టన్నులు, 9,267 మెట్రిక్ టన్నులు సన్నరకం వడ్లు కొనుగోలు చేశారు. 48,099 మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలుచేశారు.
అందుబాటులోకి కొత్త వంగడాలు
మూసీ కాలుష్య జలాలు, నదీ పరీవాహకంలోని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ప్రభుత్వం ఈ వానాకాలం నుంచి కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సంప్రదాయ రకాలకు బదులుగా హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. ఇవి చీడపీడలను తట్టుకొని, గింజ బరువు కలిగి అధిక దిగుబడిని ఇచ్చాయి. ఎకరాకు గరిష్టంగా 35 నుంచి 40 క్వింటాళ్ల (83 నుంచి 100 బస్తాలు) దిగుబడి వచ్చింది.
యూరియా కొరత
యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారు. రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాలకు తిరి గారు. కాంప్లెక్స్ ఎరువుల కొరత ఏర్పడింది.
యాప్‌పై అవగాహన లేమి
సీజన్ ప్రారంభంలో అనావృష్టి, పంట చేతికొచ్చి న సమయంలో అతివృష్టి కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయాడు. అధిక వర్షాల వల్ల పూత, పింజ రాలిపోవడంతో పాటు, చివరి సమయంలో మెంథా తుపాను మరింత దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా 68,670 మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అరకొరగా చేతికొచ్చిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. సీసీఐ కొత్తగా తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో దళారులకు అమ్ముకున్నారు. కొందరు రైతులు నేరుగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని వెళ్లగా.. కొర్రీలు పెట్టి మద్దతు ధర ఇవ్వలేదు.
పెట్టుబడి ఖర్చులు వెళ్లలేదు
ఆరు ఎకరాలు పత్తి సాగు చేశా. రూ.2.50 లక్షలు ఖర్చు వచ్చింది. వర్షాలు కురిసిన సమయంలో కూలీలు రాలేదు. చాలా వరకు పత్తి నేలపాలైంది. కేవలం 34 కింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.6300కి విక్రయించాను. మద్దతు ధర రూ.10వేలు ఉంటే మేలు జరిగేది.
– తండ జంగయ్య, జనగాం,
సంస్థాన్‌నారాయణపురం మండలం
2025 సంవత్సరంలో వ్యవసాయం ఒడిదుడుకులతో సాగింది. వరి పర్వాలేదనిపించగా, పత్తి నిండా ముంచింది. పంట చేతికొచ్చిన సమయంలో వరుస వర్షాలు, మెంథా తుపాను పత్తి రైతును కోలుకోకుండా చేసింది. పెట్టుబడి కూడా వెళ్లక అప్పుల పాలయ్యారు. వరి మెరుగైన దిగుబడి రావడం అన్నదాతకు కాస్త ఊరటనిచ్చింది.
– సాక్షి,యాదాద్రి
పత్తి ముంచింది
పత్తి ముంచింది


