మున్సిపోల్స్‌కు రెడీ..!
యాదాద్రి జిల్లాలో మున్సిపాలిటీల వారీగా 2019 నాటి ఓటర్ల వివరాలు
పెరగనున్న ఓటర్ల సంఖ్య
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా వా టిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆయా మున్సిపాలిటీల వారీ గా ఇప్పటివరకు ఉన్న ఓటరు జాబితాలను తీసుకుంది. ఎప్పుడు షెడ్యూలు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చింది.
పదవీ కాలం ముగిసి 11 నెలలు..
ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 11 నెలలు దాటింది. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 25వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాటి పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల సమస్య తప్పడం లేదు. మున్సిపాలిటీలకు 40:30:30 నిష్పత్తిలో ‘అమృత్ 2.0’ వంటి పథకాల కింద రావాల్సిన గ్రాంటు, ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణంగా పాలక వర్గాలు ఉంటే వారు ప్రభుత్వాన్ని సంప్రదించి కావాల్సిన నిధులను తెచ్చుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వారి నిధులను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
పునర్విభజన లేకపోతే
జనవరిలోనే షెడ్యూల్
ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభభజన చేసి 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన చేస్తుందా? లేదా? అన్న తేలాల్సి ఉంది. ఒకవేళ వార్డుల పునర్విభజన చేయకపోతే జనవరి రెండో వారం లేదంటే మూడో వారంలో షెడ్యూలు జారీచేసే అవకాశం ఉంది. పునర్విభజన చేస్తే కనుక ఫిబ్రవరిలో షెడ్యూలును జారీ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈలోగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ.. ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవచ్చని కూడా భావిస్తోంది.
ఫ మున్సిపాలిటీ ఎన్నికలకు
ప్రభుత్వం కసరత్తు
ఫ ముందుగా మున్సిపాలిటీ..
ఆ తరువాతే పరిషత్ ఎన్నికలు!
ఫ కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం
మున్సిపల్ ఎన్నికలపై దృష్టి
ఫ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు
ఉమ్మడి జల్లాలోని 19 మున్సిపాలిటీల పరిధిలో గతంలో జరిగిన ఎన్నికల ప్రకారం 6,57,901 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 3,11,120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 1,52,290 మంది ఉండగా, పురుషులు 1,58,827 మంది, ట్రాన్స్‌జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 2,14,490 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,04,075 మంది, మహిళలు 1,10,414 మంది, ట్రాన్స్‌జెండర్లు ఒకరు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,30,578 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 63,187 మంది ఉండగా, మహిళలు 67,373 మంది, ట్రాన్స్‌జెండర్లు 18 మంది ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదు, సవరణ ద్వారా వారి సంఖ్య భారీగా పెరుగుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
ఆలేరు 6,624 6,902 0 13,526
భువనగిరి 28,560 24,836 1 53,397
చౌటుప్పల్ 6,689 13,593 0 20,282
మోత్కూర్ 7,740 7,300 0 15,040
పోచంపల్లి 6,943 7,923 0 14,866
యాదగిరిగుట్ట 6,631 6,819 17 13,467


