పట్టణాలకు హంగులు
ఎక్కడెక్కడ ఏయే పనులకు ఎన్ని నిధులు..
సాక్షి, యాదాద్రి : పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం (యూఐడీఎస్) కింద మున్సిపాలిటీలకు ఇటీవల మంజూరైన నిధులతో మరిన్ని వసతులు కల్పించేలా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు రెండు నెలల క్రితం తెలంగాణ రైజింగ్ విజన్–2027 పథకంలో భాగంగా రూ.90 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో 2026 మార్చినాటికి మున్సిపాలిటీల్లోని ప్రజలకు మెరుగైన వసతులు కల్పించనున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఆయా పనులకు శంకుస్థాపన చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు
భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం ఇప్పటికే రూ.90 కోట్లు విడుదల అయ్యాయి. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. అయితే మున్సిపాలిటీల్లో చేపట్టే పనుల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్ తయారులో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.. మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశమై ప్రతి పనికి డీపీఆర్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే..
రానున్న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పనులకు శంకుస్థాపన చేసే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. అభివృద్ధి పనులు ప్రారంభించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రెండు నెలల క్రితం మంజూరైన నిధులకు సంబంధించిన చేపట్టాల్సిన పనులపై డీపీఆర్‌లు పూర్తి కాలేదు. వెంటనే డీపీఆర్‌లు పూర్తిచేసి సాంకేతిక అనుమతి కోసం ఈఎన్‌సీకి పంపిస్తారు. అక్కడినుంచి అనుమతి రాగానే మున్సిపాలిటీల వారీగా టెండర్ల ప్రక్రియపూర్తి చేస్తారు. అనంతరం శంకుస్థాపన చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. మున్సిపాలిటీల అభివృద్ధి, డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాంతాల్లో మౌలిక వసతులు, పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు ఖర్చు చేస్తారు.
మున్సిపాలిటీల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశం
ఫ ఎన్నికలకు ముందే అభివృద్ధి పనులశంకుస్థాపనలకు ప్లాన్
ఫ రెండు నెలల క్రితమే యూఐడీఎస్ పథకం కింద నిధులు
ఫ తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా రూ.90 కోట్లు విడుదల
ఫ డీపీఆర్‌ల పూర్తికి అధికారుల కసరత్తు
భువనగిరి మున్సిపాలిటీకి విడుదలైన రూ.15 కోట్లలో రోడ్ల నిర్మాణాలకు రూ.59.6 లక్షలు, సీసీ డ్రెయినేజీలకు రూ.46.4 లక్షలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.45లక్షలు, పార్కుల అభివృద్ధికి రూ.4 లక్షలు, ప్రధాన రహదారులపై బాక్స్ కల్వర్టుల నిర్మాణాలకు రూ.కోటి, రహదారుల జంక్షన్ల అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.
ఆలేరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులతో హైస్కూల్ ఆవరణలో ఓపెన్ జిమ్, వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, స్ట్రాం వాటర్ డ్రెయినేజీలు, ఒక పార్కు, విలీన గ్రామమైన బహుద్దూర్‌పేటలో కొన్ని పనులకు డీపీఆర్ రూపొందిస్తున్నారు.
భూదాన్‌పోచంపల్లిలో రూ.15 కోట్ల నిధులలో రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో డ్రెయినేజీలు, పార్కు నిర్మాణం, నారాయణగిరి వద్ద కల్వర్టు నిర్మాణం, విలీన గ్రామాలైన ముక్తాపూర్, రేవణవల్లిలోని శ్మశానవాటికల అభివృద్ధి పనులు చేస్తారు.
మోత్కూర్ మున్సిపాలిటికి రూ.15కోట్లుతో బీటీ, సీసీ రోడ్ల, డ్రెయినేజీ నిర్మాణాలు, విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంలో మౌలిక వసతులు కల్పిస్తారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.15 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం, సీసీ రోడ్లు, ప్రధాన పనులకు ఖర్చు చేస్తారు.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో రూ.15కోట్లతో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఖర్చుచేయడానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు.


