సమస్యలతో స్వాగతం
గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు సోమవారం అట్టహాసంగా జరిగాయి. అయితే కొన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేక పాఠశాలల ఆవరణలో, మరో చోట పశువుల ఆస్పత్రిలో నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు
వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
నిడమనూరు : నిడమనూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పదేళ్లుగా పూర్తికాకపోవడంతో పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో టెంట్ వేసి నిడమనూరు సర్పంచ్‌గా శేషరాజు సంధ్య ప్రమాణ స్వీకారం చేశారు. నిడమనూరు గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులను 2016లో ఉపాధి హామీ నిధులు రూ.12లక్షలతో మొదలు పెట్టారు. నిధులు సకాలంలో విడుదలకాకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రికి ల్యాబ్ కోసం నిర్మించిన రెండు గదులను పంచాయతీ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఎస్‌డీఎఫ్(రాష్ట్ర అభివృద్ధి నిధులతో) రూ.5లక్షలతో అసంపూర్తి పనులు చేపట్టారు. పనులు తుది దశకు చేరాయి. ప్లంబింగ్, విద్యుత్, టాయిలెట్, డ్రెయినేజీ పనులు మిగిలి ఉన్నాయి. వారం, పది రోజుల్లో పనులు పూర్తిచేసి, భవనాన్ని అందజేయనున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ తెలిపారు.
టెంట్ కింద బాధ్యతల స్వీకరణ
రాజాపేట : మండలంలోని కొత్త జాల గ్రామంలో పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డు ఎదుట టెంట్ కింద సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. 2018లో కొత్త జాల నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడగా.. గత సర్పంచ్ పాలకవర్గ సమావేశాల కోసం తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ బిల్లులు సరిగా రాక భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో నూతన సర్పంచ్ ఠాకూర్ లావణ్య, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తాత్కాలిక షెడ్డు ఎదుట టెంట్ కింద ప్రమాణ స్వీకారం చేశారు.
మేళ్లచెరువు : మండలంలోని జగ్గుతండాలో గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామంలో టెంట్ కింద ఏర్పాటు చేసిన స్టేజీ పైన ప్రమాణ స్వీకారం చేశారు.
టెంట్ కింద ప్రమాణ స్వీకారం చేస్తున్న
జగ్గుతండా నూతన పాలకవర్గం
సమస్యలతో స్వాగతం
సమస్యలతో స్వాగతం


