
ఉద్యాన పంటల్లో ‘పండు ఈగ’– నివారణ చర్యలు
గుర్రంపోడు: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో పండ్ల తోటలు, కూరగాయల తోటలు సాగుచేసే రైతులకు పండు ఈగ పురుగు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉద్యాన పంటల్లో పండు ఈగ పురుగు నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు శ్రీకొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్‌కుమార్ మాటల్లో..
ఫ ఒకప్పుడు వర్షాకాలం మొదలైన తర్వాత కొద్దిరోజులు మాత్రమే మామిడి కాయల్లో పండు ఈగ పురుగు కనిపించేది. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరమంతా అన్నిరకాల పండ్ల తోటలకు పండు ఈగ పురుగు సోకి 30 నుంచి 50 శాతం వరకు దిగుబడికి నష్టం చేస్తోంది. జామ కాయల్లో ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంది.
ఫ పండు ఈగ మామడి, జామ, సీతాఫలం, అరటి, బొప్పాయితో పాటు కాకర, అనప, పొట్లకాయ, దోస లాంటి తీగజాతి కూరగాయల్లో కూడా కనిపిస్తుంది.
ఇలా గుర్తించాలి..
పండు ఈగ ఆశించిన కాయలకు ఉన్న రంధ్రాలను(సూదితో గుచ్చినట్లుగా) బట్టి గుర్తించవచ్చు. ఇలాంటి కాయలను కోసి చూస్తే అందులో పిల్ల పురుగుల కనిపిస్తాయి. ఈ కాయలు తర్వాత దశలో శిలీంధ్రం ఆశించి కుళ్లిపోతాయి. పిల్ల పురుగులు కాయల నుంచి బయటకు వచ్చి కోశస్థ దశలో గడుపుతాయి. ఆ తర్వాత ఇవి వ్యాప్తి చెంది కాయలను ఆశించి ఉధృతిని పెంచుకుంటాయి. పండ్ల జాతి పంటల్లో పండు ఈగ నివారణకు మిథైల్ యుజినాల్ ఎరలను, కూరగాయ పంటల్లో క్యూలూర్ అనే ఎరలను ఉపయోగించాలి.
పండ్ల తోటల్లో..
గతంలో వర్షాకాలం మొదలైన తర్వాత మామిడి తోటల్లో చెట్టుపైన ఉన్న కాయలకు ఈ పండు ఈగ ఆశించేది. ఈ మధ్యకాలంలో జామ, సీతాఫలంలో ఈ పురుగు ఉధృతి పెరిగింది. జామకాయలు పరిపక్వతకు వచ్చే సమయంలో ఈ పురుగు ఆశించి పదునైన సూది లాంటి పరికరంలో గుచ్చినట్లుగా కాయపై రంధ్రాలు చేసి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు అందులో పొదిగి పరిపక్వత చెంది లోపల మ్యాగట్స్‌గా అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఇవి పండు లోపల గుజ్జును తినేస్తాయి. పండు ఈగ ఆశించిన పండ్లు తొందరగా మగ్గిపోతాయి. రెండో దశలో పండ్లు రాలిపోయి, వాటిలోని పిల్ల పురుగులు భూమిలోకి వెళ్లి కోశస్థ దశ గడిపి తల్లి ఈగలు బయటకు వచ్చి మరలా వచ్చే కొత్త దిగబడులను ఆశించి ఉధృతిని పెంచుకుంటాయి. పండు ఈగ నివారణకు ప్రధానంగా కలపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పాదులను శుభ్రం చేసి పారతో మట్టిని కదిలించాలి. దీనివలన ఎండకు కోశస్థ దశలోని పురుగులు ఎండకు చనిపోతాయి. ఆ తర్వాత చెట్టుకు 20 నుంచి 40 గ్రాముల కార్భోఫ్యూరాన్ 3జి గుళికలు వేసుకోవాలి. లింగాకర్షణ బుట్టలను ఎకరాకు పది నుంచి 15 అమర్చుకుని పురుగు ఉధృతిని గమనించవచ్చు. ఒక్కో బుట్టలో 40 పురుగులు పడినట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు, 10 నుంచి 15 పురుగులు పడినట్లయితే ఉధృతి మధ్యస్ధంగా ఉన్నట్లు, 4 కంటే తక్కువ పురుగులు పడినట్లయితే ఉధృతి తక్కువగా ఉన్నట్లు గమనించుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మలాథియాన్ 2 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలుపుకుని 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
కూరగాయ పంటల్లో..
బీర, కాకర, సోర, దోస, పుచ్చ వంటి తీగజాతి పంటల్లో పిందె రాకముందే నల్లగా మాడిపోయి రాలిపోతాయి. పెరుగుతున్న పిందెలు వంకరగా మారుతాయి. పండు ఈగ నివారణకు ఎకరాకు 8 వరకు లింగాకర్షణ బుట్టలు పెట్టడం వల్ల మగ ఈగలను ఆకర్షించడంతో పాటు వాటి ఉధృతిని తెలుసుకోవచ్చు. ఎరలను పిందె దశ నుంచి ఏర్పాటు చేసుకుంటే దిగుబడి పూర్తయ్యే వరకు పనిచేస్తుంది. భూమిని బాగా దున్నడం వల్ల వాటిలో ప్యూపాలు బయటకు వచ్చి ఎండకు చనిపోవడం, పక్షులు తినడం జరుగుతుంది. దీని వల్ల తర్వాతి తరం పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పండు ఈగ నివారణకు సాయంత్రం పూట మలాథియాన్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి వేప నూనె పది వేల పీపీఎంతో కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఉద్యాన పంటల్లో ‘పండు ఈగ’– నివారణ చర్యలు