
హెచ్‌ఎండీఏలోకి రీజినల్
ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ వివరాలతో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల
హెచ్‌ఎండీఏ ప్రకటించిన గ్రామాలు
సాక్షి, యాదాద్రి : వంద మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను తమ పరిధిలోకి తెచ్చేందుకు అలైన్‌మెంట్ వివరాలతో హైదరాబాద్ మెట్రో డెవెలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో ఉత్తర భాగంలో ఉన్న తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, దక్షిణ భాగంలో ఉన్న చౌటుప్పల్, నారాయణపురం, నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ, చండూరు మండలాలకు చెందిన గ్రామాల పేర్లు ప్రకటించింది. ఈ రోడ్డులో వస్తున్న భూముల సర్వే నంబర్లు, గ్రామాల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఈనెల 15వ తేదీలోగా భూములు కోల్పోతున్న వారు తమ అభ్యంతరాలను తెలియచేయాలని కోరింది. కాగా భువనగిరి, చౌటుప్పల్, నారాయణపురంలో ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు.
పక్కాగా సమాచారం
ట్రిపుల్ ఆర్ ప్రాథమిక ప్రకటనపై 15 వరకు అభ్యంతరాలు స్వీకరించి అనంతరం తుది నోటిఫికేషన్ ఇస్తామని హెచ్‌ఎండీఏ ప్రకటించింది. భూములు కోల్పోతున్న వారు తమ భూముల వివరాలను తెలియజేసే గూగుల్ కోర్డినేట్స్, డిజిటల్ రూట్ మ్యాప్‌లను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇటీవల ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ఈ పరిఽధిని పెంచిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు మండలాలకు అదనంగా తుర్కపల్లి, రాజాపేట, వలిగొండ, నారాయణపురం మండలాలను హెచ్‌ఎండీఏలో చేర్చింది. ఇందులో ఉత్తర భాగంలో 27 గ్రామాలు, దక్షిణ భాగంలో 6 గ్రామాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు, మర్రిగూడ మండలాలకు చెందిన కొన్ని గ్రామాలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ విస్తరణ పెంపు ఇప్పటికే ప్రభుత్వం చేపట్టింది. సుమారు 162 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
గణేష్ నిమజ్జనం తర్వాత..
రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని కోరుతున్న చౌటుప్పల్, భువనగిరి, నారాయణపురం మండలాల రైతులు ఈనెల 8 తర్వాత అభ్యంతరం తెలుపడానికి సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. గణేష్ నిమజ్జనం తర్వాత బాధితులు హెచ్‌ఎండీఏకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ఫార్మాట్ ప్రకారం తమ అభ్యంతరాలను తెలుపనున్నారు. అలైన్‌మెంట్ మార్చాలని లేదంటే భూమికి భూమి ఇవ్వాలని మరికొన్ని డిమాండ్‌లు చేయనున్నారు.
ఫ ఉత్తర భాగంలో 27..
దక్షిణ రింగ్‌లో ఆరు గ్రామాలు
ఫ సెప్టెంబర్ 15 వరకు
అభ్యంతరాల స్వీకరణ
ఫ హెచ్‌ఎండీఏ పరిధిలో
మొత్తం గ్రామాలు 162
ఫ అలైన్‌మెంట్ మార్చాలంటున్న రైతులు
జిల్లా పరిధిలో చౌటుప్పల్, తంగెడపల్లి, చిన్నకొండూరు, నేలపట్ల, తాళ్ల సింగారం, నారాయణపురం మండలం చిమిర్యాల, గుడిమల్కాపురం, కంకణాలగూడెం, కోతులాపురం, పుట్టపాక, సర్వేల్, భువనగిరి మండలం గౌస్‌నగర్, కాసారం, పెంచికల్‌పహాడ్, రాయిగిరి, తుక్కాపురం, ఎర్రంబెల్లి, తుర్కపల్లి మండలం వేల్పులపల్లి, దత్తాయపల్లి, ఇబ్రహీంపురం, కోనాపురం, వీరారెడ్డిపల్లి, వలిగొండ మండలం గోకారం, పొద్దటూరు, పహిల్వాన్‌పురం, రెడ్లరేపాక, వర్కట్‌పల్లి, యాదగిరిగట్ట మండలం దాతార్‌పల్లి, మల్లాపూర్ గ్రామాలు ట్రిపుల్ ఆర్ పరిధిలో ఉన్నట్టు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. అలాగే నల్లగొండ జిల్లా పరిధిలో గట్టుప్పల మండల కేంద్రం, తెరట్‌పల్లి, చింతపల్లి మండలం కుర్మేడు, కుర్మపల్లి, మల్లెపల్లి, వింజమూరు, మర్రిగూడ మండలం బాట్లపల్లి, దామెర భీమనపల్లి, మర్రిగూడ, మెచ్చిందర్‌పూర్, నమ్మాపూర్, సారంపేట వట్టిపల్లి, వెల్మకన్నె ఉన్నాయి.