
అంతుచిక్కని వ్యాధి.. అంతులేని వ్యఽథ
అడవిదేవులపల్లి: సజావుగా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా కుదేలైంది. భార్యాపిల్లలతో ఆనందంగా గడుతున్న ఆ కుటుంబ పెద్దకు అంతుచిక్కని వ్యాధి సోకి మంచానికే పరిమితమయ్యాడు. అప్పు చేసి మరీ వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం పూట గడవడమే కష్టంగా మారింది. వివరాలు.. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి కలకండ చినసైదులు, మౌనిక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు హర్షవర్ధన్, అనిర్యణ్య సంతానం. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2023 ఆగస్టులో చినసైదులుకు కుడి చేతి బొటనవేలికి వాపు వచ్చింది. దీంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. రోజుల వ్యవధిలోనే వాపు చేతికి మొత్తం పాకింది. వెంటనే మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. అయినా వాపు తగ్గకపోగా.. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. చేతులు, కాళ్లు పనిచేయకపోవడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు.
అప్పులపాలైన కుటుంబం..
రెండేళ్లుగా అంతుచిక్కని వ్యాధితో చినసైదులు పెద్దాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. అతడికి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు రూ.10లక్షల వరకు అప్పు చేశారు. తమకున్న ఎకరం పొలం, ఇంటి స్థలాన్ని కూడా అమ్ముకున్నారు. ఒక వైపు తెచ్చిన అప్పులు తీర్చలేక, మరో వైపు కుటుంబం గడవడం కష్టంగా మారిందని చినసైదులు భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లలను అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ.. ఇంటి వద్దనే ఉంటూ భర్తకు సేవలు చేస్తోంది మౌనిక . సదరం సర్టిఫికెట్‌లో 82శాతం దివ్యాంగుడని ధ్రువీకరించినా ప్రభుత్వం చినసైదులుకు పింఛన్ మంజూరు చేయలేదని అతడి భార్య వాపోయింది. దయార్ధ హృదయులు స్పందించి ఆర్థిక సాయం చేస్తే తన భర్త ఆరోగ్యం బాగుపడుతుందని, తమ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కుతుందని చినసైదులు భార్య మౌనిక వేడుకుంటోంది.
ఫ మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద
ఫ అన్నీ తానై చూసుకుంటున్న భార్య
ఫ అప్పు చేసి వైద్యం చేయించినా కోలుకోని వైనం
ఫ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

అంతుచిక్కని వ్యాధి.. అంతులేని వ్యఽథ