
ఉత్తమ విద్యాప్రమాణాల పెంపునకు గుర్తింపు
గరిడేపల్లి: గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పానుగోతు ఛత్రునాయక్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నల్ల గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆయన 1996 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. 2003లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు. చిలుకూరు, వేములపల్లి, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడులో మండల విద్యాధికారిగా సేవలు అందించారు. ఎంఈఓగా విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేశారు. పనిచేసిన ప్రతి పాఠశాలలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారు. మఠంపల్లి పాఠశాలలో 680 మొక్కలు, గరిడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 500లకు పైగా మొక్కలు నాటించారు. ఆయన పనిచేసిన చోట పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేశారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు. ఆకస్మిక సెలవులు తప్పా ఎలాంటి ఇతర సెలవులను ఆయన ఉద్యోగ జీవితంలో వాడుకోలేదు.