
ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి
భువనగిరి: గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 5న గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భువనగిరి పట్టణ శివారులోని పెద్ద చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చెరువు వద్ద భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు వద్ద తాగు నీరు, వైద్యం, మూత్రశాలలు, శానిటేషన్, లైటింగ్స్, క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, మత్స్యశాఖ, ఇరిగేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గణేష్ నిమజ్జనం అనంతరం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పట్టణ సీఐ రమేష్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.