కోదాడ: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు సైన్స్‌పై ఉన్న మక్కువతో తన స్నేహితుడితో కలిసి తయారు చేసిన సైన్స్ మోడల్‌కు పేటెంట్ లభించింది. వీరు తయారు చేసిన సౌరశక్తితో పని చేసే సోలార్ డీహైడ్రేటర్ మోడల్‌కు ఇండియన్ పేటెంట్ కార్యాలయం న్యూఢిల్లీ వారు ఈనెల 21న తమ గెజిట్‌లో ప్రచురించారు. ఈ పరికరాన్ని ఉపయోగించి సూర్యరశ్మి ద్వారా ఆహార పదార్థాలు ఎలాంటి రంగు మారకుండా, పోషకవిలువలు తగ్గకుండా ఎండబెట్టుకోవచ్చు.
రూపకల్పన ఇలా..
సూర్యాపేట జిల్లా మునగాల ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్రం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీరామ్ శ్రీనివాస్.. శ్రీనిధి యూనివర్సిటీలో భౌతికశాస్త్రం అస్టిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పోతుకనూరి నాగరాజుతో కలిసి ఈ పరికరాన్ని తయారు చేశారు. తక్కువ ఖర్చుతో, సౌరశక్తితో ఈ పరికరం పనిచేస్తుంది. లోకాస్ట్ డీ హైడ్రేటర్ విత్ ఇన్‌డైరెక్ట్ సోలార్ ఎనర్జీ గా ఈ పరికరానికి పేరు పెట్టారు. సూర్యరశ్మి ఏ దిశలో ఉన్నా ఈ పరికరం సౌరశక్తిని గ్రహించి పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి ఆహార పదార్థాలను ఎండబెట్టుకోవచ్చు. దీని వల్ల ఆహార పదార్థాల నాణ్యత, పోషకవిలువలు, రంగు తగ్గవని వీరు చెపుతున్నారు. ఈ మోడల్‌ను ఇటీవల రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించారు.
పేటెంట్ పొందడం ఆనందంగా ఉంది
తక్కువ ఖర్చుతో సౌరశక్తిని ఉపయోగించుకొని పనిచేసే విధంగా ఈ పరికరాన్ని తయారు చేశాం. పేటెంట్ కోసం సంవత్సరంన్నర క్రితం దరఖాస్తు చేశాం. ఇండియన్ పేటెంట్ కార్యాలయం వారు వివిధ దశలలో దీన్ని పరిశీలించి మాకు ఈ నెల 23న పేటెంట్ ఇస్తూ అధికారిక జర్నల్‌లో ప్రచురించడం ఆనందంగా ఉంది.
– డాక్టర్ శ్రీరామ్ శ్రీనివాస్
హక్కులు సాధించిన ప్రభుత్వ
ఉపాధ్యాయుడు శ్రీరామ్ శ్రీనివాస్
సోలార్ డీహైడ్రేటర్ మోడల్‌కు పేటెంట్