
ఇంకుడు గుంతలు మరిచారు!
అవగాహనలో అధికారుల నిర్లక్ష్యం
అవగాహన కల్పిస్తున్నాం
ఆలేరురూరల్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం చొరవ చూపుతున్నా క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. వర్షాకాలానికి ముందే ఇంకుడు గుంతల తవ్వకాలు పూర్తి చేయాలని ఆదేశాలున్నా ఆచరణలో పెట్టడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 12 ఇంకుడు గుంతల నిర్మాణాలే పూర్తవడం అందుకు నిదర్శనం. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
1,764 ఇంకుడు గుంతలు మంజూరు
ఉపాధిహామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 1,764 ఇంకుడు గుంతలు మంజూరయ్యాయి. ఇందులో కేవలం 12 గుంతలు మాత్రమే పూర్తి కాగా.. 87 ఇంకుడు గుంతలు పురోగతిలో ఉన్నాయి. మిగతావి పనులు మొదలుకాలేదు. ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.1.05 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటి వరకు రూ.74,400 ఖర్చు చేశారు. ఒక్కో ఇంకుడు గంతకు ప్రభుత్వం రూ.6,200 చెల్లిస్తుంది.
వృథా అవుతున్న వర్షపు నీరు
వర్షపు నీటిని భూమిలోనికి ఇంకించేందుకు అవసరమైన రీచార్జి ఫిట్స్ తగినన్ని లేకపోవడంతో భూగర్బ జలనిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7,39,448 జనాభా ఉండగా, చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,80,677 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో 3,082 చదరపు కిలో మీటర్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా ఏటా 2,31,150 కోట్ల లీటర్ల వర్షం కురుస్తుంది. ఈ నీళ్లన్నీ భూమిలో దాచుకుంటే ఒక్కొక్కరికి రోజుకు 4000 లీటర్లు అందుబాటులో ఉంటాయి. ఇళ్ల పైకప్పులపై, ఆవరణలో కురిసే వర్షాన్ని నేలలోకి ఇంకింపజేస్తే నీటి కరువే ఉండదని నిపుణుల అభిప్రాయం.
ఇంకుడు గుంతల నిర్మాణం ఇలా..
ఇంకుడు గుంత 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు 1.8 మీటర్ల లోతు ఉండాలి. అడుగు భాగంలో ఫీటున్నర మందం రాళ్లు, దానిపై ఫీటున్నర 40 ఎంఎం కంకర, వాటిపైన 3ీఫీట్ల రింగ్ అమర్చాలి. దానిపై మూత ఏర్పాటు చేసి ఐదు మీటర్ల పైపును బిగించాలి. ఇరుపక్కల 20ఎంఎం కంకర నింపాలి. వర్షం కురిసినప్పుడు ఇతర సమయంలో వృథాగా పోయే నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించాలి.
ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జల సంరక్షణ ఏవిధంగా సాధ్యమవుతుందో ప్రజలకు వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇస్తామని కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలి. గతంలో నిర్మించిన ఇంకుడు గుంతలు శుభ్రం చేయడంతో పాటు లేని ఇళ్లలో కొత్తవి నిర్మించి వాన నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉపాధిహామీ పథకంలో జలసంరక్షణ పనులు చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఇళ్లలో ఇంకుడు గుంతలు, గొట్టపు బావుల చుట్టూ నీటిని రిచార్జి చేసే కందకాల నిర్మాణం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనవారు పంచాయతీ కార్యదర్శులను సంప్రదించవచ్చు.
– నాగిరెడ్డి. డీఆర్‌డీఓ
ఇంకుడు గుంతల వివరాలు
మంజూరైనవి : 1764
పురోగతిలో ఉన్నవి : 287
పూర్తయినవి : 12
ఒక్కో ఇంకుడు
గుంతకు చెల్లిస్తుంది : రూ.6,200
జిల్లాలో గృహాలు : 1,59,745

ఇంకుడు గుంతలు మరిచారు!