
విద్యార్థి భరత్ చంద్రచారికి కలెక్టర్ హనుమంతరావు హామీ
కలెక్టర్ హనుమంతరావు
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని శేరిగూడేనికి చెందిన విద్యార్థి భరత్‌చంద్రచారికి ఇచ్చిన హామీ మేరకు కలెక్టర్ హనుమంతరావు గురువారం అతడి ఇంటిని సందర్శించారు. విద్యార్థి కుటుంబానికి రూ.5వేలు నగదు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంటర్ ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఏ అవసరం వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చదువు విషయంలో ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భవిష్యత్‌లో స్థిరపడే వరకు అండగా ఉంటానని పేర్కొన్నారు. విద్యార్థి బలహీనంగా ఉండటంతో మండల వైద్యాధికారికి ఫోన్ చేసి అతడికి రక్త పరీక్షలు నిర్వహించి, తగిన వైద్యం అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి, నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా.. గ్రామస్తులు బస్సు లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, నల్లగొండ డీఎంతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు చిమిర్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, ఎంపీఓ నర్సింహరావు తదితరులున్నారు.