
రాయితీపై యంత్రం.. సాగుకు ఊతం
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
చౌటుప్పల్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు యంత్ర పరికరాలు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు వివిధ యంత్ర పరికరాలు అందించేందకు స్మామ్(సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తు సమర్పణ ఇలా..
స్మామ్ పథకం కింద రాయితీ యంత్ర పరికరాల కోసం ఆయా మండలాల్లో రైతుల నుంచి వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. చౌటుప్పల్ మండలానికి 103 యంత్ర పరికరాలు మంజూరు కాగా.. ఇప్పటికి 56 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 77 బ్యాటరీ స్ప్రే పంపులు ఉండగా కేవలం 10 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులు సంబంధిత గ్రామ ఏఈఓలకు లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జీరాక్స్, మూడు ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది. అర్హులకు అందించే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమకానుంది.
లబ్ధిదారుల ఎంపిక..
లబ్ధిదారుల ఎంపిక కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయ అధికారి నోడల్ అధికారిగా, తహసీల్దార్, ఎంపీడీఓలు సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ రూ.లక్ష లోపు యంత్రాలు కొనుగోలు చేసే రైతులను ఎంపిక చేస్తుంది. రూ.లక్ష కంటే ఎక్కువ ధర ఉన్న యంత్రాల కొనుగోలు చేసే రైతులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా, ఆగ్రోస్ రీజనల్ బ్యాంకు ప్రతినిధి సభ్యుడిగా ఉంటారు.
వ్యవసాయ సాగులో యాంత్రీకరణ ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ యంత్ర పరికరాలను స్మామ్ పథకంలో భాగంగా అందిస్తోంది. చౌటుప్పల్ మండలానికి 103 యంత్ర పరికరాలు మంజూరయ్యాయి. వీటి కోసం రైతుల నుంచి ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నాం. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీంతో ఆసక్తి ఉన్న రైతులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది.
– ముత్యాల నాగరాజు,
మండల వ్యవసాయాధికారి, చౌటుప్పల్
స్మామ్ పథకంలో భాగంగా రైతులకు అందజేయనున్న కేంద్ర ప్రభుత్వం
ఫ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు
చేసుకునేందుకు గడువు

రాయితీపై యంత్రం.. సాగుకు ఊతం