
మూసీకి తగ్గిన ఇన్‌ఫ్లో
ఫ ఒక గేటు ద్వారా నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గింది. మూసీ రిజర్వాయర్‌కు శుక్రవారం 3,498 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఒక క్రస్టు గేటును రెండు అడుగుల మేర పైకెత్తి 1230 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 527 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రం వరకు నీటిమట్టం 643.35 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలుకు గాను ప్రస్తుతం 4.03 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ పేలి
వృద్ధుడు మృతి
కొండమల్లేపల్లి(చింతపల్లి): ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాపురం గ్రామానికి చెందిన గార్లపాటి రాములు(82) ఇంట్లో ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి రాములు ఇంట్లో నిద్రించగా.. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలిపోయింది. చుట్టుపక్కల గమనించి జేసీబీని పిలిపించి ఇంటి శకలాలను తొలగించగా రాములు మృతిచెంది ఉన్నాడు. మృతుడి మనవడు ప్రవీణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు.
దొంగ అరెస్ట్
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొర్రోనితండాలో సోమవారం రాత్రి కొర్ర పట్టి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం సీఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రోనితండాకు చెందిన కేతావత్ బద్య సోమవారం రాత్రి అదే తండాకు చెందిన కొర్ర పట్టి ఇంటి తాళాలు పగులగొట్టి కేజీ వెండి, రూ.1.50లక్షల నగదు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ అజ్మీరా రమేష్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బద్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకుని, జైలుకు తరలించినట్లు న్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ అజ్మీరా రమేష్, క్రైమ్ సిబ్బంది హేమునాయక్, భాస్కర్‌ను నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.

మూసీకి తగ్గిన ఇన్‌ఫ్లో