భీమవరం: ఇరాన్‌పై దాడిని, ఖమేనీ హత్యను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఖండించకపోవడం మన దేశ ప్రతిష్టను మసకబారుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో గురువారం నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద దురాక్రమణ చర్యలు, మారణ కాండను అన్ని పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక వాదులు, ప్రపంచ శాంతిని కోరుకునేవారంతా ఖండించాలని కోరారు. ఇరాన్‌పై అమెరికా దాడి ఆయిల్ వనరులను ఆక్రమించుకోవడానికేనని అన్నారు. ఇరాన్ అణుకేంద్రాల నిర్వహణను అణ్వాయుధాలు తయారు చేయడానికేనని తప్పుగా చిత్రీకరించి అమెరికా దుష్ప్రచారం చేస్తోంనద్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం మాట్లాడుతూ అరబ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లిన భారతీయుల రక్షణకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల మన దేశంలో ఆయిల్, గ్యాస్ సంక్షోభంతో దేశ ప్రజలపై భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో సీపీఎం నేతలు ఏవీ నాగేశ్వరరావు, మంతెన సీతారాం, ఎ.రవి, బి.వాసుదేవరావు పాల్గొన్నారు.


