వసతులు మృగ్యం.. జీవనం భారం | - | Sakshi
Sakshi News home page

వసతులు మృగ్యం.. జీవనం భారం

Mar 6 2026 8:00 AM | Updated on Mar 6 2026 8:00 AM

ఇబ్బందులు పడుతున్నాం సమస్యలు పరిష్కరించాలి

కాలనీల్లో దాహం కేకలు

రహదారులు గోతులమయం

రహదారులు అధ్వానం.. తాగునీటికి నిరంతరం తప్పని అవస్థలు.. డ్రెయినేజీ సౌకర్యం చెప్పే పనే లేదు. ఇదీ జిల్లా వ్యాప్తంగా హౌసింగ్‌ లేఅవుట్ల (జగనన్న కాలనీ) పరిస్థితి. 70 శాతం లేఅవుట్లలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో లబ్ధిదారులు నిత్యం సమస్యలతో సహవాసం చేయాల్సిన దుస్థితి. వర్షాకాలంలో వీరి అవస్థలు వర్ణనాతీతం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా హౌసింగ్‌ లేఅవుట్లలో కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై శ్రద్ధ చూపడం లేదు.

మేము మూడేళ్లుగా విస్సా కోడేరు లేఅవుట్‌లో నివాసం ఉంటున్నాము. కాలనీలో రోడ్డు దారుణంగా ఉన్నాయి. వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా తయారవుతున్నాయి. నడవడానికి కూడా వీలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం గ్రావెల్‌ రోడ్లు అయిన నిర్మించాలి.

– ఎం.దుర్గ,

విస్సాకోడేరు లేఅవుట్‌, భీమవరం

మేము ఏడాదిగా నివాసం ఉంటున్నాము. ఇక్కడ మంచినీటికి పైపులైన్లు వేశారు కాని కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కరించాలి.

– జి.లోయిస్‌,

విస్సాకోడేరు లేఅవుట్‌, భీమవరం

భీమవరం (ప్రకాశం చౌక్‌): పేదల సొంతింటి కల నెరవేర్చడానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా హౌసింగ్‌ (జగనన్న కాలనీ) లేఅవుట్లు ఏర్పాటు చేసింది. లబ్ధిదారులకు ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కరోనా విపత్తు దాటిన తర్వాత ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యాయి. దీంతో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు సైతం చేశారు. హౌసింగ్‌ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను గత ప్రభుత్వం కొంతవరకు కల్పించింది. అనంతరం ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలనీల్లో మౌలిక సదుపాయాలపై పట్టించుకోవడం లేదు. కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి పైపులైన్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన వాటికి గృహప్రవేశాలు చేసి చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం తప్ప వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీల్లోని సమస్యలపై మహిళలు పీజిఆర్‌ఎస్‌కు వచ్చి మొరపెట్టుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

విస్సాకోడేరు లేఅవుట్‌లో సమస్యల వలయం

జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటికి సంబంధించి ఉన్న విస్సాకోడేరు లేఅవుట్‌(జగనన్న కాలనీ) సమస్యల వలయంగా ఉంది. జిల్లాలోనే పెద్ద లేఅవుట్‌గా ఉన్న ఈ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి నుంచి లోపల అంతర్గత రోడ్లు వరకు అధ్వానమే. పైపులైన్లు వేసిన కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. పైపులైను కట్‌ చేశారని కాలనీ వాసులు వాపోతున్నారు. మున్సిపాలిటీ నుంచి మంచినీళ్లు వారానికి ఒకసారి ట్యాంకుల ద్వారా సరఫరా చేయడంతో తాగునీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రతి వేసవిలో వచ్చి ఇళ్ల నిర్మాణం వేగంగా జరగాలని మీటింగ్‌లు పెట్టడం తప్ప అక్కడ ఉన్న వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఇళ్లు గృహప్రవేశాలు చేసిన వారు అక్కడ ఉన్న సమస్యలు తట్టుకోలేక ఇళ్లకు తాళాలు వేసి బయటకు అద్దెకు ఉంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేస్తే ఆయా కాలనీల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయని, ఇప్పటికై నా ప్రభుత్వం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పలుచోట్ల తాగునీటికి సైతం కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని లేఅవుట్‌ల్లో పైపులైన్లు వేసినా.. కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్ని లేఅవుట్‌ల్లో పైపులైన్లే వేయలేదు. దీంతో ఆయా కాలనీల్లోని ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట నుంచి మంచినీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

హౌసింగ్‌ లేఅవుట్లలో కానరాని మౌలిక సదుపాయాలు

రోడ్లు అధ్వానం.. తాగునీటికి అవస్థలు

వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు

పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌

జిల్లావ్యాప్తంగా 630 లేఅవుట్లు ఉండగా సుమారు 50 వేల ఇళ్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో 60 శాతం ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో దాదాపు 70 శాతం లేవుట్‌ల్లో రోడ్లు నిర్మాణం జరగలేదు. దాంతో కాలనీల్లో ప్రధాన రహదారులు నుంచి వీధిరోడ్లు వరకు అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలంలో బురదలో నడిచి వెళ్లడానికి నరకం చూస్తున్నారు. చిన పిల్లలు స్కూల్‌కి, మహిళలు పనులకు బయటకు వెళ్లే సమయంలో అధ్వానంగా ఉన్న రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను వాహనాల్లో తెచ్చుకొవడానికి కూడా వీలు లేని పరిస్థితి పలు లేఅవుట్లలో ఉంది. గోతులమయంగా ఉన్న రోడ్లలో వాహనాలు దిగబడి ముందుకుసాగే పరిస్థితి ఉండడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement