చర్యలు తీసుకుంటాం
● బొండాడ మేజర్ డ్రెయిన్ ఆక్రమించి వంతెన నిర్మాణం
● ముంపుబారిన వరిచేలు.. అధికారుల కుంటిసాకులు
ఉండి: రైతులను ఆదుకోవాల్సిన అధికారులే కూటమి నేతలకు దాసోహం పలికి మట్టి మాఫియాకు అండగా నిలవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా మేజర్ డ్రెయిన్ ఆక్రమించుకుని అక్రమంగా పూడ్చివేసి మట్టి అక్రమ రవాణా కోసం వంతెన నిర్మించడంపై రైతులు మండిపడుతున్నారు.
ముంపు బారిన వరిచేలు
ఉండి మండలంలో ఆరేడు, పాందువ్వ, యండగండి, ఉప్పులూరు, కోలమూరు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, చిలుకూరు, వెలివర్రు తదితర గ్రామాలతో పాటు ఆకివీడు, పాలకోడేరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వరిపంట ఆకస్మికంగా ముంపు బారిన పడింది. దీంతో కొందరు రైతులు డ్రెయినేజీ అధికారులను సంప్రదించగా మాయమాటలతో కాలం గడిపేశారు. తీరా అసలు విషయం తెలిశాక రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
విషయం ఏంటంటే.. రూ.కోట్ల విలువైన మట్టిని భారీ ఎత్తున అక్రమంగా తరలించేందుకు అనువుగా మట్టి మాఫియా ఉండి మండలం వాండ్రం శివారులో బొండాడ మేజర్ డ్రెయిన్‌ను ఆక్రమించి భారీ వంతెన నిర్మాణం చేపట్టారు. డ్రెయిన్ మూడొంతులు పూడ్చివేసి భారీ లారీలు వెళ్లేలా వంతెన నిర్మాణం చేశారు. దీంతో ప్రతి రోజు భారీగా వెళ్లే నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడటంతో డ్రెయిన్ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పైనుంచి వస్తున్న ప్రవాహంతో నీటిమట్టం రోజురోజుకు పెరిగి వరిపొలాలు ముంపుకు గురవుతున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం పొట్టదశలో వున్న వరిచేలు మునిగిపోవడంతో కుళ్లిపోతున్నాయి. డ్రెయిన్‌లలోని నీరు ఎగదన్నడంతో ఆక్వా వ్యర్థాలు వరిచేలల్లోకి చేరి చేలు ఎందుకు పనికాకుండా పోతు న్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
అధికారుల కుంటిసాకులు
దీనిపై రైతులు అధికారులను ప్రశ్నించగా జువ్వలపాలెం రోడ్డులో కోపెల్ల వంతెన నిర్మాణం చేస్తుండడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా ఉందని ఒకసారి, మేజర్ డ్రెయిన్‌లో తూడు పెరిగిపోయిందని మరోసారి, ఉండి అక్విడెక్టు వద్ద తూడు మేటలు వేస్తుందంటూ ఇంకోసారి ఇలా రకరకాల సాకులు చెప్పి మోసగిస్తున్నారు. దీంతో విషయం అర్థమైన రైతులు గట్టిగా నిలదీయగా మట్టి మాఫియాను పట్టించుకోవద్దని కూటమి నేతల నుంచి ఫోన్‌లు వస్తున్నాయని, అందుకే ఏం చెయ్యలేకపోతున్నామంటూ ఓ అధికారి వాపోయారు. ఉండి నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బొండాడ మేజర్ డ్రెయిన్‌పై అక్రమంగా వంతెన నిర్మించినట్లు నాకు తెలియదు. కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు. దీనిపై పరిశీలన చేసి ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం.
– రుద్రరాజు అప్పన్న, డ్రెయిన్స్ డీఈ, భీమవరం


