యథేచ్ఛగా మట్టి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

Mar 7 2026 9:34 AM | Updated on Mar 7 2026 9:34 AM

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

పెనుగొండ: నక్కల డ్రెయిన్‌లో అక్రమ తవ్వకాలు యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్‌ను ఆనుకొని లంక భూములు మట్టి మాఫియాకు వరంగా మారాయి. గురువారం నుంచి తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు ఆ ప్రాంతానికి దరిదాపుల్లోకి రాకపోవడం విశేషం. ఇటు రైతులనుంచి, అటు నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురైనా తవ్వకాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు తవ్వకాలకు అడ్డుతగిలారు. మట్టి తవ్వకానికి అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తూ మరీ తవ్వకాలు జరుపుతుండడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. చివరకు శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆచంట వేమవరం సర్పంచ్‌ జక్కంశెట్టి చంటి తవ్వక ప్రాంతంలో నిరసన వ్యక్తం చేయడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దృష్టికి సమస్యను తీసుకు వెళ్లారు. దీంతో మట్టి తవ్వక ప్రాంతాలను పరిశీలించి, అక్రమ తవ్వకాలతో రైతులకు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు చోద్యం చూడడం దారుణమని విమర్శించారు.

రైతులు, నాయకులకు డబ్బులు ఇచ్చాం

మట్టి మాఫియా తమకు అడ్డు లేదంటూ తీవ్ర నిర్లక్ష్య ధోరణిలో వ్యహరించడం కొసమెరుపు, పరీవాహక ప్రాంత రైతులకు డబ్బులు ముట్టచెప్పామని చెబుతున్నారని పలువురు రైతులు ఆరోపించారు. డబ్బులతో కొనేసామని, రాజకీయ పలుకుబడి ఉందని తమకు ఎవరు ఎదురు చెబుతారంటూ విర్రవీగుతున్నారన్నారు.

ముంపు ప్రమాదం

నక్కల డ్రెయిన్‌ తవ్వకం వల్ల ఆచంట వేమవరం పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే యలమంచిలి మండలంలో ఏటిగట్టు మరమ్మతుల పేరుతో 2025లో నక్కల డ్రెయిన్‌ గట్టును పూర్తిగా తవ్వేశారు. ఇదే ప్రాంతంలో మరోసారి తవ్వకాలు జరుపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా నక్కల డ్రెయిన్‌ ఉధృతికి ఆచంట వేమవరం పరిసర ప్రాంతాల వరిచేలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పుడు మరింతగా తవ్వకాలు జరపడం వల్ల వేలాది ఎకరాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నక్కల డ్రెయిన్‌లో తవ్వతున్న మట్టిని పాలకొల్లు, భీమవరం పరిసర ప్రాంతాల్లోని లే అవుట్ల పూడికలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.20 లక్షల విలువ గల మట్టిని తరలించడానికి బేరసారాలు కుదుర్చుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

నిరసనలు పెరగడంతో ఆచంట తహసీల్దారు డి.సోమేశ్వరరావు మట్టి తవ్వక ప్రాంతాలను పరిశీలించారు. అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వాహనాలను తహసీల్దారు కార్యాలయానికి తరలించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement