సర్కారుపై నిరసన స్వరం | - | Sakshi
Sakshi News home page

సర్కారుపై నిరసన స్వరం

Mar 7 2026 9:34 AM | Updated on Mar 7 2026 9:34 AM

●ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఎడాపెడా హామీలు ●రెండేళ్లు కావస్తున్నా పట్టాలెక్కించని చంద్రబాబు ప్రభుత్వం ●హామీల అమలుకు పోరుబాటలో ఆయా వర్గాలు

ఉద్యమం తీవ్రతరం

హామీలు అమలుచేయాలి

కమిటీ పేరుతో తాత్సారం

ఆందోళన ఉధృతం చేస్తాం

హీటెక్కుతున్న జిల్లా

నిరసన తెలుపుతున్న విలేజ్‌ సర్వేయర్లు

సాక్షి, భీమవరం : మొన్న ఆశాలు.. నిన్న అంగన్‌వాడీలు.. నేడు సర్వేయర్లు.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు ప్రభుత్వంపై పోరుబాట సాగిస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ రోడ్డెక్కి నిరసన గళం వినిపిస్తున్నారు. నిత్యం ఎక్కడోచోట ఆయా వర్గాల వారి వరుస ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో జిల్లా వాతావరణం హీటెక్కుతోంది.

గత ఎన్నికల్లో అధికారమే పరమావధిగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తదితర కూటమి నేతలు ఎడాపెడా హామీలిచ్చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమల్లోకి తెస్తామని చెప్పుకొచ్చారు. పాలన చేపట్టి నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం వాటి ఊసెత్తకపోగా సర్వేల పేరుతో తీవ్ర పనిభారం మోపి ఇబ్బందులు పాల్జేస్తోంది. ప్రభుత్వ తీరుపై ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ ఉద్యమం చేయగా, పీహెచ్‌సీ వైద్యులు రోజులు తరబడి సమ్మె చేశారు. కూటమి వచ్చాక ఈ 21 నెలల కాలంలో రాష్ట్ర కమిటీల పిలుపుపై ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాల్టీ, సహకార, విద్యుత్‌, తదితర శాఖలకు చెందిన రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎన్నికల వాగ్దానాలు, సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీగా ఉద్యమాలతో హోరెత్తించారు. తమ ఉపాధికి చేటు చేస్తున్న మద్యం బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించాలని కోరుతూ కల్లుగీత కార్మికులు ఆందోళన నిర్వహించగా, కౌలు గుర్తింపు కార్డులు మంజూరుచేయాలని, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ కౌలు రైతులు ఇటీవల రెండు రోజుల పాటు రిలే దీక్షలు చేశారు.

ఉద్యమం తీవ్రతరం

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం పెంచాలని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, అలాగే కనీస వేతనం రూ. 26 వేలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్లు గతంలో పలుమార్లు ఆందోళనలు చేశారు. స్పందన లేకపోవడంతో జిల్లా నుంచి రెండు వేల మందికి పైగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు జిల్లా నుంచి చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లి దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ హామీలు అమలుచేయకుంటే భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

విలేజ్‌ సర్వేయర్ల నిరసన

సర్వేయర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం విలేజ్‌ సర్వేయర్లు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. జనవరి 23న మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సహాయ నిరాకరణ చేపట్టి తమ సమస్యలపై ఉన్నతాధికారులకు వినతులు అందజేసినట్టు సంఘ నాయకులు తెలిపారు. కమిటీ ఏర్పాటుచేసి 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 5 నుంచి మళ్లీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ప్రమోషన్‌ స్కేలు పెంచాలని, కొందరు సర్వేయర్లుపై ఉన్న సస్పెన్షన్లు ఎత్తివేయాలని, సర్వేల భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల్లో విజయం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఈ ప్రభుత్వం అనేక హామీలిచ్చింది. ఇప్పటి వరకు వాటిని అమల్లోకి తీసుకురాలేదు. పెండింగ్‌ బకాయిలు విడుదల, సీపీఎస్‌ ఉద్యోగస్తులు ఓపీఎస్‌ గా మార్చడం తదితర హామీలు అమలుచేయాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

– కేవీ రామచంద్రరావు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

కనీస వేతనం పెంచుతామని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ చెల్లిస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకాన్ని అంగనన్‌వాడీలకు అమలు చేయాలి. మే నెలలో సెలవులు ఇవ్వాలి. వాటిని అమలుచేయకపోగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదు.

– శ్యామల, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియనన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు, పెంటపాడు

సహకార సంఘ ఉద్యోగుల వయోపరిమితి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత జాయిన్‌ అయిన సిబ్బందిని కంటిన్యూ చేయాలన్న డిమాండ్లపై గతంలో ఆందోళన చేసినా స్పందన లేదు. ఇటీవల మరోమారు ధర్నాలు నిర్వహించాం. కమిటీ వేశామని, నివేదిక వచ్చాక పరిష్కరిస్తామంటూ తాత్సారం చేస్తున్నారు.

– కోయ యేసుబాబు, ఎల్‌బీ చర్ల సొసైటీ సీఈఓ

ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చినట్టుగా పెట్టుబడి సాయం కింద కౌలు రైతులకు రూ.20 వేలు అందజేయాలి. ఈ సీజన్‌కు సంబంధించి రెండు విడతల సొమ్ము జమచేయాలి. పంట నష్టపరిహారంతో పాటు, యజమానులకు సంబంధం లేకుండా ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి.

– మామిడిశెట్టి రామాంజనేయులు, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా వర్గాల వారి వరస ఆందోళనలు, నిరసనలతో జిల్లా హీటెక్కుతోంది. రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్‌, ప్రకాశంచౌక్‌ సెంటర్‌, అలాగే మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాలు, డివిజన్‌ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాలు వద్ద టెంట్లు ఏర్పాటుచేసి ధర్నాలు చేసి అధికారులకు వినతులు అందజేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలతో ఆయా ప్రాంతాలు మార్మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై విజయవాడలో ప్రభుత్వం పోలీసు జులుం ప్రదర్శించి అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement