ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాఽథ్ గురువారం రాత్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు, పండితులు న్యాయమూర్తికి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆలయ ఏఈఓ ఎం.దుర్గారావు తదితరులున్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పక్కన నిలిపి ఉంచిన పాత వాహనాలను తొలగించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం శుక్రవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ శాఖలు టీంలుగా ఏర్పడి భీమవరం పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డు, టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా, టౌన్ హాల్ రోడ్డు, కూడలిలో రోడ్ల పక్కన దీర్ఘకాలికంగా నిరుపయోగంగా ట్రాఫిక్‌కు అవరోధంగా ఉన్న వివిధ రకముల 11 పాత వాహనాలు ఖాళీ ప్రదేశానికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న 30 హోర్డింగ్‌లు తొలగించడం, ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న ఆవులను తరలించామని మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు ప్రకారం రోడ్ల పక్కన పాత వాహనాలు వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
భీమవరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమాన్ని జిల్లా ఆర్మర్‌డ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడుతూ భావి భారత పౌరులైన విద్యార్థులకు పోలీసు విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో వినియోగించే అత్యాధునిక ఆయుధ సంపత్తి, రక్షణ సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ చట్టాలు, వేధింపులకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, సామాజిక మాధ్యమాల్లో పొంచి ఉన్న ముప్పుపై సమగ్ర అవగాహన కల్పించారు.


