తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ కార్మికులకు 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం మొదటి రోజు రిలే దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఓఎస్ రద్దు విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, రద్దు చేస్తే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12వ పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలని, 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మరణించిన, అనారోగ్యం పాలైన విశ్రాంతి సభ్యుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, క్లాప్ డ్రైవర్లుకు 21 వేల జీతం చెల్లించాలని, పర్మినెంట్ కార్మికులకు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట నాయకులు ధనాల వెంకట్రావు, జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలు అమలు చేయకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు.


