చికెన్ సరిపోవడం లేదని ఆందోళన
నూజివీడు: చికెన్ అరకొరగా పెడుతున్నారని ఆదివారం ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లోని మెస్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీలోని మెస్‌ల నిర్వహణను హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు అప్పగించారు. శాఖాహారం మాత్రమే పెడతామని ఈ ఫౌండేషన్ కండిషన్ పెట్టింది. విద్యార్థులకు వారంలో నాలుగు రోజుల పాటు కోడిగుడ్డు, రెండు రోజుల పాటు చికెన్ పెట్టే బాధ్యతను క్యాంపస్‌లో విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు అప్పగించారు. దీనికి గాను ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ.6.69లు ట్రిపుల్‌ఐటీ చెల్లిస్తుంది. ఈనెల 23న 12 గంటలకు మెస్‌లో భోజనాలు ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు చికెన్ రాలేదు. చివరకు 1.30 గంటలకు ఉన్న చికెన్ అయిపోగా మిగిలిన వారు తమకు చికెన్ ఏదని నిలదీసేసరికి ఫ్యాకల్టీ తిట్టడంతో ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు మెస్ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రతి వారం తమకు చికెన్ సరిపోవడం లేదని, రెండోసారి వెళ్లి కొద్దిగా పులుసు వేయమన్నా వేయడం లేదని విద్యార్థులు వాపోయారు. హెల్పింగ్ హ్యాండ్స్‌ను అడ్డం పెట్టుకొని కొందరు ఫ్యాకల్టీ కోడిగుడ్లు, చికెన్ వ్యవహారాన్ని నడుపుతుండటం గమనార్హం. విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయాన్ని ఫ్యాకల్టీలు ఏఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన విద్యార్థుల వద్దకు వచ్చి బెదిరింపు ధోరణిలో వార్నింగ్‌లు ఇచ్చినట్లు సమాచారం. విద్యార్థులు తమ సమస్యలను చెప్పేందుకు లేచి నిల్చుంటే వారి ఐడీ, బ్రాంచి వివరాలు అడగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వారానికి రెండు రోజులు చికెన్ పెట్టమంటే కేవలం ఒక రోజు మాత్రమే అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


