షష్ఠి ఉత్సవాలకు అత్తిలి ముస్తాబు
● నేడు స్వామివారి కల్యాణం
● 26న షష్ఠి మహోత్సవం
అత్తిలి: రాష్ట్రంలో పేరుగాంచిన అత్తిలి శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు నిర్మించి, విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. ఈ నెల 25 నుంచి డిసెంబరు 9 వరకు జరిగే మహోత్సవాలలో ప్రతి రోజు సాయంత్రం స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి 7.20 గంటలకు దాసం ప్రసాద్, రాజరాజేశ్వరి దంపతులచే శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. 26న షష్ఠి తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం కోలాట భజన, అన్నసమారాధన, రాత్రి శ్రీస్వామివారి ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయని షష్ఠి కమిటీ అధ్యక్షుడు కురెళ్ల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దిరిశాల మాధవరావు తెలిపారు.
కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు
భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి తిరునాళ్లు ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, కుజదోషం, కాల సర్పదోషం ఉన్నవారు ఈ దేవాలయాన్ని దర్శించి, స్వామికి పంచామృతాలతో అభిషేకించడం ద్వారా తమ కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. సంతానంలేనివారు నాగుల చీర కట్టుకుని, ముడుపులు కడతారు. సంతానం కలిగిన తరువాత పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుని, పిల్లలపై నుంచి బూరెలను పోసే సంప్రదాయం ఇక్కడ ఉంది. చిన్నపిల్లలకు నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి శుభకార్యక్రమాలు ఈఆలయంలోనే నిర్వహిస్తుంటారు. షష్ఠి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల సెట్టింగ్‌లు నెలకొల్పారు. ఉత్సవాలలో అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై పి.ప్రేమరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.
షష్ఠి ఉత్సవాలకు అత్తిలి ముస్తాబు
షష్ఠి ఉత్సవాలకు అత్తిలి ముస్తాబు


