గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
నరసాపురం రూరల్ : పేరుపాలెం బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. ఏలూరులోని కొత్తపేటకు చెందిన మునగాల సాయిగణేష్(19) ఆదివారం తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వచ్చాడు. సముద్ర స్నానం చేస్తుండగా అలల ఉధృతికి గల్లంతైన విషయం విధితమే. సోమవారం మోళ్ళపర్రు తీరంలో గణేష్ మృతదేహం కొట్టుకురావడంతో పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏలూరు రూరల్: డిసెంబర్ 3న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 25న ఏలూరులో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నామని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆసక్తి గలవారు 9948779015 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లా అటవీ శాఖాధికారి(టెరిటోరియల్)గా పోతంశెట్టి వెంకట్ సందీప్ రెడ్డి జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సందీప్ రెడ్డి 2019లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. గతంలో డోర్నాల సబ్ డివిజనల్ అటవీ శాఖాధికారిగా, ఆత్మకూరు ఇన్‌చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కడప, పాడేరు జిల్లా అటవీశాఖాధికారిగా విధులు నిర్వహించి ఏలూరు జిల్లాకు బదిలీపై వచ్చారు.
ఏలూరు (టూటౌన్): కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలని, ఎకో సెన్సిటివ్ జోన్, చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో పదో కాంటూరుకు పెంచరాదని డిమాండ్ చేస్తూ జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కొల్లేరు ప్రజలు, రైతుల పరిరక్షణ కమిటీ తరఫున ఏ.రవి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం 26న ఉదయం 11 గంటలకు ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు.
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం


