మంత్రిది మౌనమే..
సాక్షి ప్రతినిధి, వరంగల్:
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన పరిణా మాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో క్రమశిక్షణ సంఘం నివేదిక పీసీసీ చీఫ్‌కు చేరడం.. మరోవైపు మంత్రి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో వరుస అరెస్టులు, జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్ సస్పెన్షన్.. ఇలా ఒకదాని వెంట ఒకటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ‘ఇక కొండాపై ఏం తేల్చనున్నారు?’ అన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది.
టీపీసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక..
‘కొండా’ శిబిరంలో కలకలం..
కొండా సుస్మిత వ్యాఖ్యలు, తదుపరి పరిణామాలపై విచారణ పూర్తి చేసి నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అందించినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్ల డించారు. మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయడం, ఆమె వివరణ ఇవ్వడం, అనంతరం కమిటీ తన అభిప్రాయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి సమర్పించడం వరకూ వ్యవహారం చేరింది. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని కోరినట్లు మల్లు రవి ప్రకటించడంతో కొండా సురేఖ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది.
రెండు పరిణామాలు ఒకే సమయంలో..
రాజకీయంగా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం.. పరిపాలనా, పోలీసు కోణంలో నార్ల సుమంత్ కేసు.. రెండూ ఒకే సమయంలో తెరపైకి రావడంతో కొండా కుటుంబంపై రాజకీయ ఒత్తిడి పెరిగిందన్న చర్చ సాగుతోంది. ఆయన గతంలో మంత్రి సురేఖకు ఓఎస్‌డీగా పనిచేసినందునే ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి, ‘హత్యాయత్నం’ ఆరోపణలతో నమోదైన కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్‌తోపాటు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదులో జాప్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌ను సస్పెండ్ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.
అసలు టార్గెట్ ఎవరు?
ఓరుగల్లులో ఉత్కంఠ
ఇప్పటి వరకు కుమార్తె వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి సురేఖను బాధ్యురాలిని చేయాలా? లేదా అది సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్య లుగానే పరిగణించాలా? అన్నది కాంగ్రెస్‌లో చర్చ జరిగినా..చివరకు క్రమశిక్షణ సంఘం నివేదికలో సురేఖ వ్యవహారంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడు పర్యాయాలు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని కమిటీ ప్రస్తావించడం.. ఈసారి కఠిన చర్యలకు సిఫారసు చేశామనడం.. కొండా శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సుమంత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ రెండు పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం ఎలాంటి రాజకీయ సమీకరణాన్ని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులను హైదరాబాద్‌కు పిలిపించడం.. క్రమశిక్షణ సంఘం నివేదిక తీవ్రత.. పీసీసీ స్థాయిలో తదుపరి కసరత్తుపై జరుగుతున్న ప్రచారం.. ఇవన్నీ కలిపి చూస్తే త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవిపై ప్రభావమా? పార్టీ పరంగా చర్యా? వివాదానికి ఫుల్‌స్టాపా? లేక సర్దుబాటా? కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చబోతోందన్నదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
సాక్షి, వరంగల్ : వన మహోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం వరంగల్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖను సుస్మిత వ్యాఖ్యలు, సీఎంతో వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె స్పందించకుండా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందించే మంత్రి ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో పార్టీ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, అధిష్టానం కదలికలను బట్టే కొండా ఆలోచనలుంటాయని అనుచరులు అంటున్నారు.
డ్రైవర్ సహా నలుగురు అరెస్టు..
నిర్లక్ష్యం చేసిన సీఐపై వేటు
ఒకేసారి రాజకీయ రచ్చ.. పోలీసు కేసు..
హైదరాబాద్‌కు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు


