నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో భూముల వినియోగ మార్పు (ల్యాండ్ యూజ్ చేంజ్) వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారింది. పట్టణ పరిధిలోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన సుమారు 16,438 చదరపు గజాల భూ వినియోగాన్ని మార్చాలని మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన తేవడంపై బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అక్రమమా..సక్రమమా! పూర్తి వివరాలు తెలియజేసే వరకు ఆమోదించొద్దని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కమిషనర్‌కు డీసెంట్ నోటీసు అందించారు. దీంతో సందిగ్ధత నెలకొంది.
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల ఆందోళన
ఐలుప్ మ్యాప్ ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఈ మార్పు ఉందని, ఇది పట్టణ భవిష్యత్ ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతుందని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పుతో భవిష్యత్‌లో రోడ్లు, పార్కులు, డ్రెయినేజీలు, ఓపెన్ స్పేస్‌లకు కేటాయించాల్సిన స్థలాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. సమీప ప్రాంత ప్రజలపై, ట్రాఫిక్, తాగునీరు, మౌలిక వసతులపై పడే భారం గురించి ఎలాంటి నివేదికను కౌన్సిల్ సమావేశంలో పేర్కొనలేదన్నారు. దీనికి సంబంధించిన మ్యాపులు, టెక్నికల్ రిపోర్టులు, అధికారుల అభిప్రాయాలు కౌన్సిలర్లకు ఇవ్వకుండా హడావుడిగా తీర్మానం చేయాలని చూడడం వెనుక అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజా ప్రయోజనాల కోసమా.. లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అనే అనుమానాలు కమిషనర్‌కు ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు. ఇప్పటికై నా ఈ భూ వినియోగ మార్పుపై టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల నుంచి పూర్తి సాంకేతిక నివేదిక తెప్పించి, పారదర్శకంగా వ్యవహారించాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతర పత్రాన్ని అందించారు. ఈ విషయంపై అధికార పార్టీ కౌన్సిలర్లు, అధికారులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.
సర్వే నంబర్లు ఇవే..
కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కోసం ప్రవేశపెట్టిన సర్వే నంబర్లు 719/1, 722/1, 722/2, 722/1/3, 738/1, 738/2,/1/2, 738/2/2, 739/1/2, 739/2/1/1/2, 739/2/2లో ఉన్న భూములను ఐలుప్ మ్యాప్‌లో ఉన్న ప్రస్తుత కేటగిరీ నుంచి వేరే కేటగిరీకి మార్చేందుకు ప్రవేశపెట్టారు.
నర్సంపేట కౌన్సిల్ సమావేశంలో
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల అభ్యంతరం
కమిషనర్‌కు డీసెంట్ నోటీసు అందజేత


