న్యూశాయంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని గ్రామ, వార్డుల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో బీఎల్‌ఓలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను ప్రజల ముందు ప్రదర్శించి తప్పులు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారన్నారు. ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితా వివరాలను పరిశీలించి అర్హతలేని పేర్లు జాబితాలో ఉంటే బీఎల్‌ఓలకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌ఆర్ సమస్యలు పరిష్కరించాలి
పెండింగ్ భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లతో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.
వివిధ పార్టీల ప్రతినిధులతో
కలెక్టర్ సమావేశం


