గీసుకొండ: నులిపురుగులతో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి రావడమే కాకుండా విద్యార్థులు చ దువులో వెనకబడిపోయే అవకాశం ఉంది. శరీరంలోని పేగుల్లోకి చేరిన నులిపురుగులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్‌తో చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిని నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరి చేందుకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నేడు (సోమవారం) నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.
నులిపురుగులు వ్యాపించే మార్గాలు
● కలుషిత ఆహార పదార్థాలు, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, ధూలి పడిన పదార్థాలు తినడం వల్ల నోటి నుంచి పొట్ట, పేగుల్లోకి నులిపురుగులు చేరుతాయి.
● బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం, కా ళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లను వినియోగించడం ద్వారా ఇవి శరీరంలోకి చేరుతాయి.
మాత్రలు ఎవరు వేసుకోవద్దంటే..
సంవత్సరం లోపు వయస్సు ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధ కేన్సర్ ఉన్నవారు, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఈ మాత్రలను వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కాగా నులిపురుగులు పేగుల్లోని రక్తాన్ని తాగి తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఫలితంగా రక్తహీనత వస్తుంది. కాగా జిల్లాలోని 910 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు 908 అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రలు వేసేందుకు అన్ని సిద్ధం చేసినట్లు ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు.
ఒక్క మాత్ర మింగితే చాలు
నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
జిల్లాలో 1.96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం


