కాజీపేట అర్బన్: సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలనే సంకల్పంతో ఈనెల 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె మిగులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిదితో పాటు డీఐజీ కార్యాలయం కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా కొడకండ్లలో నిర్మాణంలో ఉంది. కాగా, ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మాణంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది.
స్థల సేకరణకు కలెక్టర్లకు వినతులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్‌ఓలో డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో వినతులు అందజేశారు. ఒక్కో కార్యాలయానికి ఒక్కో ఎకరం భూమి అందుబాటులోకి తెచ్చుకోవాలని, స్థల సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వమే స్వయంగా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు.
ప్రతీ నెల మిగలనున్న రూ.1,88,852 అద్దె
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఎనిమిది కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రతి నెల1,88,852 రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాలను నిర్మిస్తే ఈ మొత్తం నగదు మిగలనుంది.
స్థలం సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు
కలెక్టర్లకు వినతుల అందజేత
అద్దెలకు చెక్.. ఖజానాకు మిగలనున్న ఆదాయం


