హసన్‌పర్తి: ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కిట్స్ కళాశాల సమావేశపు మందిరంలో పోలీస్ అధికారుల నెలవారీ నేర సమీక్ష మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులు, వివిధ నేరాల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సీపీ సమీక్షించారు. అనంతరం కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ప్రతి కేసును పాదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కేసుల్లో నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతీ కాల్‌పై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 సెల్‌ఫోన్లను సీపీ బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్రనాయక్, కిశోర్‌సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ శ్వేత


