వర్ధన్నపేట మున్సిపాలిటీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా కృష్ణ | - | Sakshi
Sakshi News home page

వర్ధన్నపేట మున్సిపాలిటీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా కృష్ణ

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా ఖమ్మం కృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కమిషనర్‌గా నియమితులైన అశోక్‌ వారం రోజుల పాటు విధులు నిర్వహించిన అనంతరం బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో పరిపాలన పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మున్సిపాలిటీ పాలకవర్గం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్‌ ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఖమ్మం కృష్ణకు ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా అధికారులు బాధ్యతలు అప్పగించారు. కాగా నూతన కమిషనర్‌ను స్థానిక నాయకులు శాలువాతో సత్కరించగా సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో నేతావత్‌ శివారాణి, రాజేందర్‌, కీమా నాయక్‌, దేవేందర్‌, నాయకులు అనిమిరెడ్డి, రామ చంద్రారెడ్డి, మాలోతు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒకటో తారీఖు వేతనాలు మాకు వర్తించవా?

నర్సంపేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, చిరు ఉద్యోగులందరికీ ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆదేశించినా.. అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు మాత్రం రావడం లేదని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఐసీడీఎస్‌ ప్రారంభమై 50సంవత్సరాలు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత కల్పించకపోగా గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. జాబ్‌ చార్ట్‌ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఆరోగ్యలక్ష్మి సేవలు, ఎన్‌హెచ్‌టీఎస్‌, పోషణ్‌ ట్రాకెర్‌ రెండు యాప్‌లో ఆన్‌లైన్‌ సేవలు చేస్తూ చాలీచాలని వేతనాలతో జీవితం సాగిస్తున్నామన్నారు. దీనికి తోడు బీఎల్‌ఓ డ్యూటీలు, అదనపు పనులతో అంగన్‌వాడీ సేవలు కుంటుపడుతున్నాయని, పని ఒత్తిళ్లతో అనారోగ్య సమస్యల పాలవుతున్నారని పేర్కొన్నారు. రావాల్సిన గౌరవ వేతనాలు కూడా ప్రతీ నెల అడక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్‌ నెల వేతనాలు ఇవ్వాలని, వచ్చే నెల నుంచి కనీసం 5వ తేదీలోపు అయినా వేతనాలు వచ్చేలా చూడాలని కోరారు.

రికార్డుల నిర్వహణపై

డీపీఓ ఆగ్రహం

నల్లబెల్లి: అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శి వద్ద రికార్డులు ఇన్నాళ్లు ఎలా ఉంచారు.. బదిలీపై వెళ్లి బాధ్యతలు అప్పగించకపోతే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎంపీఓ పసరగొండ రవిని జిల్లా పంచాయతీ అధికారి కల్పన మందలించారు. నల్లబెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం డీపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డుల నిర్వహణ, పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు అప్పగింతలో జాప్యం, గ్రామసభల నిర్వహణ, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్‌కు ఫోన్‌ చేసి నల్లబెల్లి నుంచి వెళ్లి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు చార్జ్‌ ఎందుకు అప్పగించలేదు, జీపీ రికార్డులు నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావని ప్రశ్నించారు. ఇకపై ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామసభలను నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో అక్రమ లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు, జమ, ఖర్చుల వివరాలను ప్రతీ గ్రామసభలో ప్రజల ముందు వెల్లడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగెల్లి జ్యోతి ప్రకాశ్‌, ఉప సర్పంచ్‌ గుమ్మడి వేణు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement