పణుకువలసలో వణుకు..! | - | Sakshi
Sakshi News home page

పణుకువలసలో వణుకు..!

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

పణుకువలసలో వణుకు..!

ప్రమాదకరంగా వంతెన

వాహనాల రాకపోకలు నిలిపివేత

పరిశీలించిన రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు

తెర్లాం: రాజాం–రామభద్రపురం ఆర్‌ అండ్‌ బీ రోడ్డులో తెర్లాం మండలంలోని పణుకువలస జంక్షన్‌ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది. వంతెనకు దక్షిణ దిక్కున ఉన్న రక్షణ గోడ, వంతెన కొంత భాగం శుక్రవారం ఉదయం పూర్తిగా కూలిపోయింది. గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ఆ వర్షానికి వంతెనకు ఓ వైపు శిథిలావస్థకు గురైన రక్షణ గోడ, వంతెనలో సగభాగమంతా పూర్తిగా పడిపోయింది. పణుకువలస జంక్షన్‌ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్‌ ఆర్‌.ధనం, డిఫ్యూటీ తహసీల్దార్‌ జి.సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఏఈ రాజు, మాజీ ఎంపీపీ ప్రతినిధి నర్సుపల్లి వెంకటేశ్వరరావులు వెంటనే వంతెన వద్దకు వెళ్లి పరిశీలించారు. వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో మిగిలిన వంతెన భాగం కూడా ప్రమాదకరంగా మారిందని, భారీ వాహనాలు వంతెన పైనుంచి రాకపోకలు సాగిస్తే పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ఆ వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వంతెన పైనుంచి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ప్రమాదకరంగా ఉన్న వంతెన పరిస్థితిని కలెక్టర్‌కు తెలియజేస్తానని తహసీల్దార్‌ ధనం తెలిపారు. పణుకువలస వద్ద ఉన్న వంతెన రక్షణగోడ ఓ పక్క పూర్తిగా పడిపోయిందని, మిగిలిన వంతెన భాగం ప్రమాదకరంగా ఉందన్న విషయాన్ని మాజీ ఎంపీపీ ప్రతినిధి వెంకటేశ్వరరావు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్‌ అండ్‌ బీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు వంతెన పరిస్థితిని ఏఈ రాజు తెలియజేశారు. వంతెన పైనుంచి భారీ వాహనాలు రాకుండా రెండు వైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. వంతెన మీదుగా భారీ వాహనాలు రాకుండా చూడాలని పణుకువలస వీఆర్‌ఏను తహసీల్దార్‌ ఆదేశించారు.

ఇబ్బందిపడుతున్న వాహన చోదకులు,

ప్రయాణికులు

పణుకువలస వంతెన ఓ పక్క పూర్తిగా కూలిపోవడం, వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు, కార్లు, బస్సులు ఎక్కువగా ఈ వంతెనపై నుంచి వెళ్తుంటాయి. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేయడంతో రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి రాజాం, శ్రీకాకుళం వైపు వస్తున్న వాహనాలు, శ్రీకాకుళం, రాజాం వైపు నుంచి సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు వస్తున్న వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీకాకుళం నుంచి సాలూరు, బొబ్బిలి వెళ్లేందుకు వస్తున్న బస్సులు పణుకువలస జంక్షన్‌ వద్ద నిలిపివేస్తున్నారు. సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి వస్తున్న వాహనాలు తెర్లాం జంక్షన్‌ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత వేగంగా వంతెనకు మరమ్మతులు చేపట్టాలని, లేదా వంతెన పక్క నుంచి వాహనాలు వెళ్లేందుకు డైవర్షన్‌ ఇప్పించాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement