ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సోషల్‌ మీడియా సైనికులపై ఉందని వైఎస్సార్‌సీపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నా రు. విజయనగరం జిల్లా సోషల్‌ మీడియా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి సోషల్‌ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే టీడీపీ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు.

సోషల్‌ మీడియా శక్తివంతమైన సాధనం

సోషల్‌ మీడియా కేవలం పోస్టులు పెట్టే వేదిక మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం కలింగించే శక్తివంతమైన సాధనమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను వాస్తవాలతో ప్రజలకు చేరవేయాలని పార్టీ సోషల్‌మీడియా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదలలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇది బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తుచేశారు. విజయనగరం జిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో ఒకటని, ఇక్కడ జరిగే ప్రతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రజలకు వివరించాలని, కూటమి దుష్ఫ్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బలంగా తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మేల్యే బొత్స అప్పలనరసయ్య, బొత్స అనూష, బొత్స సందీప్‌, రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి యూత్‌ వింగ్‌ అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, జిల్లా సోషల్‌ మీడియా అధ్యక్షుడు వై.వాసునాయుడు, ఎస్‌.కోట యూత్‌ వింగ్‌ అధ్యక్షుడు వాకాడ సతీష్‌ దొర, జిల్లా సోషల్‌ మీడియా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, కెల్ల సురేష్‌, నియోజకవర్గాల అధ్యక్షులు కనకల కృష్ణ, ఎ.వీరస్వామి, ఎడ్ల కిశోర్‌, సీరాపు వంశీరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, మండలాల సోషల్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

సోషల్‌ మీడియా

సైనికులు సమర్థంగా

పనిచేయాలి

శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement