విజయనగరం రూరల్: జిల్లాలోని 27 మండలాల్లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్‌కు ముందున్న వివరాల మేరకే ఫొటోలతో కూడిన గ్రామీణ ఓటర్ల జాబితాను శుక్రవారం అన్ని కార్యాలయాల వద్ద ప్రచురించారు. జిల్లాలోని 27 మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తొలుత ఫొటో ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం మండల పరిషత్ కార్యాలయాలు, జెడ్పీ కార్యాలయం వద్ద అధికారులు ప్రచురించారు. 2021వ సంవత్సరంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీల పదవీకాలం ఈ నెల 23న, జెడ్పీటీసీల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపట్టింది.
విజయనగరం జిల్లా పరిధిలో విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 449 ఎంపీటీసీ స్థానాలకు, 27 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, చంద్రబాబు సర్కారు ఆలోచన ప్రకారం ఎంపీపీల ఎన్నిక నేరుగా ప్రజలతో నేరుగా ఎన్నికోబడితే, మండలానికో ఎంపీపీ చొప్పున 27 మంది ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. అలాగే, ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగా ఉన్న విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు ఈ నెల 25 నుంచి కొత్త జిల్లా పరిషత్‌లుగా అవతరించనున్నాయి.
పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఏర్పాట్లు
పాత ఓటర్ల జాబితా ప్రకారం స్థా నిక ఎన్నికల నిర్వహణకుసర్కా రు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. సర్ ప్రక్రియలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. వీటిని పట్టించుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా సమాచారం
అసెంబ్లీ నియోజక వర్గాలు: 07
మండలాలు: 27
ఎంపీటీసీలు: 449
ఎంపీపీలు: 27
జెడ్పీటీసీ స్థానాలు: 27
పోలింగ్ కేంద్రాలు: 7,398
పురుష ఓటర్లు: 6,36,006
మహిళా ఓటర్లు: 6,49,664
ఇతరులు: 34
మొత్తం ఓటర్లు: 12,85,704
ఓటర్ల జాబితా ప్రచురణ
ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1994 నియమ నిబంధనలు, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు జిల్లాలోని జెడ్పీ ప్రాదేశిక నియోజక వర్గాలకు, మండల ప్రాదేశిక నియోజక వర్గాలకు సంబంధించి ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను శుక్రవారం మండల పరిషత్, జెడ్పీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. జెడ్పీటీసీ నియోజకవర్గాలకు సంబందించి ఓటర్ల జాబితాను జెడ్పీ సీఈవో ఎ.లోవరాజు జెడ్పీ కార్యాలయం వద్ద ప్రచురించారు. ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రచురించిన ఓటర్ల జాబితాను ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పరిశీలించవచ్చని ఆయన తెలిపారు.
ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించిన
అధికారులు
ఈ నెల 23న
ఎంపీటీసీలు, 24న ముగియనున్న
జెడ్పీటీసీల
పదవీకాలం


