విజయనగరం: వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈనెల 12న ఉదయం 10 గంటలకు నగరంలోని పూల్‌బాగ్ జగన్నాథ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తామని పార్టీ జిల్లా కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ కమిటీ సభ్యులు, నియోజకవర్గ/మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల సభ్యులు, పార్టీ కమిటీలలో వివిధ హోదాల్లో ఉన్న సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ కార్పొరేటర్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, సోషల్ మీడియా సైనికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.
నేడు జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎన్‌ఐ యాక్ట్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబందిత కేసులు, సివిల్ కేసులతో పాటు, ఇతర కేసులను సైతం పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఫూల్‌బాగ్ కాలనీ హనుమాన్ నగర్‌లోని ఎంఆర్‌వీఆర్‌జీఆర్‌పీజీ బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలోని నూతన కోర్టు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ
విజయనగరం గంటస్తంభం: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన ‘మట్టి వినాయకుడు పర్యావరణ పరిరక్షణకు మన వంతు’ పోస్టర్లు, కరపత్రాలను శుక్రవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈఈ సరిత మాట్లాడుతూ, పీవోపీ విగ్రహాలు, రసాయన రంగులకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.


