కూటమి నాయకులను కలిస్తేనే...
ముకుందపురం గ్రామానికి చెందిన 11 మంది వివిధ పింఛన్లకు అర్హులుగా ఉన్నారు. ఇందుకోసం ఐదు రోజుల కిందటే సచివాలయానికి దరఖాస్తుతో పాటు అన్ని వివరాలు అందజేశారు. కాని ఇంతవరకు ఆన్‌లైన్ చేయలేదు. కూటమి నాయకులను కలిస్తేనే ఆన్‌లైన్ చేస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం.
– గడే రామారావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు, ముకుందపురం
సంతకవిటి:
అర్హులైన వారందరూ కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు గడువు తక్కువగా ఇచ్చి, లేనిపోని నిబంధనలు పెట్టినప్పటికీ అర్జీదారులు అష్టకష్టాలు పడి దరఖాస్తులను ఆన్‌లైన్ చేయించుకునే పనిలో ఉన్నారు. అయితే మండలంలోని మోదుగులపేట సచివాలయ సిబ్బంది మాత్రం అర్జీదారుల దరఖాస్తులను ఆన్‌లైన్ చేసే పనిలో మెతకవైఖరి కనబరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయ పరిధిలోని ముకుందపురానికి చెందిన 11 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల దరఖాస్తులను శుక్రవారం సాయంత్రం వరకు ఆన్‌లైన్ చేయలేదు. శనివారం సెలవు రోజు అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ సచివాలయానికి వచ్చి కొందరి దరఖాస్తులను ఆన్‌లైన్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ముకుందపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు గడే రామారావు, గడే మల్లేశ్వరరావు, తదితరులు సచివాలయానికి చేరుకుని, తమవారి దరఖాస్తులను కూడా ఆన్‌లైన్ చేయాలని పట్టుబట్టారు. దీంతో డిజిటల్ అసిస్టెంట్ స్పందిస్తూ.. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి, మాకు ఫోన్‌లు వస్తున్నాయని రుసురుసలాడారు. దీంతో నాయకులు స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైనంత మాత్రాన వారి దరఖాస్తులను ఆన్‌లైన్ చేయరా అని ప్రశ్నించారు. గడే త్రినాథ, సూర్యారావు, పాపినాయుడు, కురిటి పారయ్య, కురిటి రమణ, పిన్నింటి తవుడు, గడే తవిటినాయుడు, కురిటి కళావతి, లోలుగు విజయకుమారి, కురిటి రామలక్ష్మి, గడే జ్యోత్స్నలకు సంబంధించిన దరఖాస్తులను ఎందుకు ఆన్‌లైన్ చేయరో చెప్పాలని కార్యదర్శిని నిలదీశారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేయడంతో కార్యదర్శి స్పందిస్తూ.. మంగళవారం నాడు అందరి దరఖాస్తులూ ఆన్‌లైన్ చేయిస్తానని చెప్పడంతో అర్జీదారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు శాంతించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి భవానీశంకర్ వద్ద ప్రస్తావించగా.. సర్వర్ డౌన్ అవ్వడంతో దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, మంగళవారం నాటికి అన్ని దరఖాస్తులు ఆన్‌లైన్ చేస్తామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పింఛన్ దరఖాస్తులు ఆన్‌లైన్ చేయని వైనం
కూటమి నాయకులను కలిస్తేనే
చేస్తామంటున్న సిబ్బంది
నిలదీసిన వైఎస్సార్‌సీపీ నాయకులు


