గరుగుబిల్లి: తుఫాన్ ప్రభావంతో ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 104.25 మీటర్లగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజీకి 8,497 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా మూడు గేట్లును ఎత్తి 7,691 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువకు 800 క్యూసెక్కులు, పాత కుడి కాలువకు 40, పాత ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
మట్టి వినాయకుడినే పూజించాలి
విజయనగరం గంటస్తంభం: వినాయక చవితిని పర్యావరణహితంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలను నివారించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని, ప్రభుత్వ మార్గదర్మకాలు పాటించాలని కోరారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్షించారు.


