విజయనగరం:
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని, ప్రతి స్థానంలో పోటీ చేసి విజయపతాకం ఎగురవేద్దామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరంలోని పూలబాగ్ జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో శనివారం వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎదుర్కోవడం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోతం, నూతనంగా నియామకమైన పార్టీ కమిటీలు అనుసరించాల్సిన విధి, విధానాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు దివంగతముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం జిల్లా స్థాయి నాయకులకు పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులను అందజేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శోభా హైమావతి, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గొర్లె రవికుమార్, శంబంగి వేణుపాల్, సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు ఆవినాష్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, జిల్లా పింఛన్ల విభాగం అధ్యక్షుడు డోలా మన్మథకుమార్, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, పార్టీ నాయకులు వేచలపు చినరామునాయుడు, రొంగలి జగన్నాథం, గులుపల్లి గణేష్, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, తదితరులు పాల్గొన్నారు.
పార్టీయే ప్రధానం
రాజకీయాల్లోకి వ్యక్తులు వస్తుంటారు.. వెళ్లిపోతుంటారు. పార్టీయే ప్రధానంగా ప్రజల కోసం పనిచేద్దాం. వక్రబుద్ధితో వ్యాపారాలు, వ్యవహారాలు నడిపితే కొంపముంచుకున్న వారిగా మిగులుతారు. విలువలు కోల్పోయి, నైతికంగా దిగజారిపోతే ఎంతటికై నా తెగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం. పార్టీ ఇచ్చేది గుర్తింపు కార్డు కాదు.. నాయకులకు భరోసా. రాష్ట్రంలో జరుగుతున్న దురాగత పాలనను ఎదుర్కొనేందుకు జగనన్న సైనికులుగా గట్టిగా నిలబడదాం. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీల్లో జగనన్న సైన్యంగా చేరడం శుభపరిణామం. సాధారణ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అందరికీ సమాజంలో మంచి గుర్తింపు లభించేలా సముచిత స్థానం కల్పిస్తారు. జిల్లా స్థాయి సమావేశానికి వచ్చిన వారంతా పార్టీపై నమ్మకంతో వచ్చిన వారే. స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎంపిక అందరి ఆమోదంతో చేయాలి. రెండున్నరేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనను ప్రజలకు వివరించాలి. పింఛన్ల దరఖాస్తుల నమోదులో వివక్షపై ప్రచారం చేయాలి. చంద్రబాబు తన ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తారే తప్ప ప్రజాసంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోరు. ఆయన పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే మనల్ని విజేతలుగా నిలుపుతుంది.
– బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత
‘స్థానిక’ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు
జిల్లా వ్యాప్తంగా జగనన్న సైనికులకు గుర్తింపు కార్డులు
అధికారంలోకి వచ్చిన వెంటనే
కమిటీలోని సభ్యులకు సముచిత స్థానం
శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ


