● 607 పాఠశాలల్లో 51,235 మందికి పూర్తయిన స్క్రీనింగ్
● 2,651 మందికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీకి సన్నాహాలు
పార్వతీపురం రూరల్: బడిపిల్లల భవితకు వెలుగులు పంచేలా పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉచిత నేత్ర వైద్య పరీక్షల పర్వం ముమ్మరంగా సాగుతోంది. జులై 15న విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ ఆదేశాలతో మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ పి.విజయలక్ష్మి, డీఈఓ పి.బ్రహ్మజీరావుల సమన్వయంతో, ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ జగన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు కంటి వెలుగుల పండగను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలోని 1,563 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలే లక్ష్యంగా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్ సిబ్బంది పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు 607 బడుల్లో 51,235 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,651 మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించగా, వారందరికీ త్వరలో ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. తీవ్రమైన సమస్యలు ఉండి, శస్త్రచికిత్సలు అవసరమైన ఐదుగురు చిన్నారులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నారు. విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించేలా 607 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు పూర్తి చేసి, కంటివెలుగులు పంచుతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.


