● ఘనంగా జెడ్పీ చైర్మన్ మజ్జి
శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు
● ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు
విజయనగరం:
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శనివారం జిల్లా కేంద్రంలో ఽఘనంగా జరిగాయి. తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మజ్జి శ్రీనివాసరావు, భార్య పుష్ఫాంజలి, కుమార్తె సిరిసహస్ర, అల్లుడు ప్రదీప్‌నాయుడు, కుమారుడు మోహిత్‌తో కలిసి విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. పూజలు అనంతరం అమ్మవారి దీవెనలు అందజేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన కార్లు, బైక్‌లతో స్థానిక ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మజ్జి శ్రీనివాసరావు, ప్రదీప్‌నగర్, ఎత్తుబ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, బాలాజీ జంక్షన్, కోట జంక్షన్ మీదుగా దాసన్నపేటలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో భాగంగా భారీగా భాణసంచా కాల్చారు. తీన్‌మార్‌తో సందడి చేశారు. జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న మజ్జి శ్రీనివాసరావును మహిళా నాయకులు హారతులిచ్చి దిష్టి తీయగా... పార్టీ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర ప్రారంభించారు.
పోటెత్తిన అభిమానం
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన నాయకులతో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ యువ నాయకురాలు బొత్స అనూషలతో కలిసి మజ్జి శ్రీనివాసరావు భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వారు పుష్ఫగుచ్ఛాలు, దుశ్శాలువాలు, కేక్‌లతో మజ్జి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీవాసరావు, విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, రాష్ట్ర కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, ఆమదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


